పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

పురజిద్దానవజిత్సుధాశనవరాంభోధీశయక్షాధిపా
శరరాడ్వహ్నిసరేతరాజమరుదీశానాదికం బైనయీ
సురబృందంబు భవత్కృపాగరిమ నక్షుద్రప్రభావంబుతో
నిరవొందుంగద కేశపాశజితమత్తేందిందిరా యిందిరా.

80


క.

ఓజనని నీవు గలచో, నేజాతివిహీను నైన నిలఁ గొలుతురుగా
రాజులుఁ గవిరాజులు బుధ, రాజులు గమికట్టి కడలిరాయనిపట్టీ.

81


చ.

మతి మఱ పూను నుస్సురను మందతఁ జెందుఁ గృశించు మాటికిన్
వెత పడు నీచవర్తనుల వేఁడఁగఁ జూచు విధిన్ నళించు లో
ధృతి చెడి క్రుంగుఁ జెంగగొను నెట్టిమహోన్నతుఁ డైన నీ జగ
ద్ధితకరుణారసప్లుతనిరీక్షణ మబ్బనివేళ శ్రీసతీ.

82


చ.

అతితరవేదశాస్త్రనిగమాంతపురాణకథావిధానవి
శ్రుతుని దరిద్రుఁ జేయుదువు చూడ నికృష్టుఁ బ్రకృష్టభాగ్యసం
యుతునిఁగఁ జేయుచుండుదు వహెూ పరికింప జగంబులందు న
ద్భుతముగదమ్మ నీమహిమ తోయజనాభవిలాసినీమణీ.

83


సీ.

కదసి ని న్నిల్లాలిఁ గాఁ జేసికొనిగదా, హరి పురుషోత్తముం డనఁగఁ బరఁగెఁ
దివిరి నీతోడ నుద్భవము నొందుటఁ గదా, శశికి రాజత్వంబు సంభవించెఁ
గోరి ని న్గారాపుఁగూఁతుఁ గాంచుటఁగదా, వనరాశి రత్నాధివాస మయ్యెఁ
దర్కింపఁ నీకు నందనుఁ డౌటచేఁగదా, మారుండు మోహనాకారుఁ డయ్యె


తే.

నహహ భవదీయదివ్యమాహాత్మ్య మెన్న, నలవి గాదు గదమ్మ శేషాహి కైనఁ
గలితశుభగాత్రి పరిచితకాళరాత్రి, సకలలోకైకజనయిత్రి జలధిపుత్త్రి.

84


వ.

అని వినుతించుదివిజమహర్షివరులం గనుంగొని యానందోత్ఫుల్లమానసుం డగుచుఁ
బితామహుం డిట్లనియె.

85

బ్రహ్మ దేవాదులకు హితంబు బోధించుట

సురలార పరమసంయమి, వరులార సమస్తభువనవంద్యుం డగునీ
హరి నీక్షింపుఁడు మీకుం, జిరతరశుభఫలము లిపుడె చేతికి వచ్చున్.

86


క.

కనుఁగొనుఁ డిద్దేవుని లో, చనములు గలఫలము పూజ సలుపుఁడు కరముల్
దనరుటకు ఫలము జిహ్విక, యొనరుటకు ఫలంబు పొగడుఁ డురగశయానున్.

87