పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

గాఁగ విశ్వస్వరూపి వై కరము మెఱయు, చుండు నీమేన నలినగర్భాండభాండ
మండలు లుదుంబరఫలోపమానము లయి, వెలయుచుండుఁగదా జగద్వినుతచరిత.

70


వ.

అనంతబ్రహ్మాండసంఘాతంబు లెవ్వనినిశ్వాసోచ్ఛ్వాసద్వయంబున విడువం బడుచు
నాహరింపంబడుచుండు నెవ్వనినిమేషోన్మేషంబుల నఖిలలోకసముదయం బడఁగుచుం
బొడముచుండు నట్టియఖిలలోకశరణ్యుండ వగునట్టినీకు నమస్కారంబు.

71


తే.

అమరవరులకు నైన మహర్షిజనుల, కైన నీమాయఁ గడవ శక్యంబు గాదు
హీనమతు లగువారి కిం కేమి చెప్ప, భక్తవత్సల జగదీశ పరమపురుష.

72


తే.

మౌనిజనవంద్య మమ్ము నీమాయవలన, దాఁటఁగాఁ జేయు మేతదర్థంబు నిన్ను
శరణుఁ గంటిమి నీపాదజలజయుగము, కన్న మా కన్యసాధనం బెన్నఁ గలదె.

73


క.

శరణాగతజనభయసం, హరణాయ సమన్తమునిజనార్చితశుభకృ
చ్చరణాయ నిత్యనిర్మల, కరుణాయ సుధీనుతప్రకరణాయ నమః.

74


వ.

అని యిట్లు బహుప్రకారంబుల నద్దేవదేవుం బ్రణుతించి మఱియు శ్రీమహాలక్ష్మి నిట్లని
వినుతించిరి.

75

దివిజమునిముఖ్యులు లక్ష్మిని నుతించుట

క.

కమలా బుధజననుతపద, కమలా కరధృతనవీనకమలా విలస
త్కమలావాసిని మము నీ, విమలకృపాలోకనమున వీక్షింపఁగదే.

76


తే.

మణిమయస్వర్ణపూర్ణకుంభములు పూని, తవిలి యిరుగడఁ గరికులేంద్రములు గొల్వఁ
జామరంబులు పూని నిర్జరవఘాటు, లెలమి భజియింప నలరు నిన్ గొలుతు మంబ.

77


ఉ.

నీకరుణావిలోకనము నిల్పినచోఁ గులహీనుఁడున్ హయా
నేకపహేమచామరమణీరమణీయవిభూషణాదికా
స్తోకవిభూతిఁ జెంది పరిశుద్ధకులుం డన మించు లేనిచో
నాకనివాసుఁడున్ వెతల నందుఁ గదమ్మ జగత్కుటుంబినీ.

78


చ.

ఉవిద లనంగుఁ డంచు విబుధోత్తము లర్కతనూజుఁ డంచు శా
త్రవులు కిరీటి యంచు వనుధాజనులెల్లఁ బ్రభుం డటంచు బాం
థవులు సముద్రుఁ డంచు వితతంబుగ నెన్నుదు రెట్టిదుర్జన
ప్రవరుని నైన నీకరుణ పర్వినవాని సరోజగేహినీ.

79