పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

విస్మయానందకారణం బగుప్రతిష్ఠావైభవంబు నాకుం దెలుపు మనినఁ గలశోద్భవుం
డిట్లనియె.

64


క.

శంభుఁడు జంభవిరోధియు, నంభోజభవుండు శశియు నర్కుఁడు దివిజుల్
రంభాదులు మునులున్ సం, రంభంబున వచ్చి రపుడు రహి నచ్చటికిన్.

65


వ.

అప్పు డజజుండు నభోమాసంబున శుక్లపక్షంబున గురువాసరంబున సింహలగ్నంబునఁ
గనత్కనకప్రాకారసంవృతంబును రత్నగోపురవిరాజితంబును జిరత్నరత్నఖచితవిత
ర్దికాసోపానమండపకుట్టిమద్వారబంధబంధురంబును మణిస్తంభసహస్రభాసితంబును
విశ్వకర్మనిర్మితంబు నగుమహనీయప్రాసాదాంతరంబున సముత్తుంగభద్రసింహాసనం
బున శ్రీమద్భావనారాయణదేవు లక్ష్మీసమేతు విధ్యుక్తహకారంబున సంస్థాపితుం జేసె
నయ్యవనరంబున.

66


సీ.

దేవదుందుభిమహారావంబు లెసఁగె గం, ధర్వకిన్నరులు గీతములు వాడి
రప్సరోభామిను లదనొప్ప నాడిరి, జలదముల్ పుష్పవర్షంబు గురిసె
మునులు సామామ్నాయముల వినుతించిరి, మునుకొని శుభతూర్యములు సెలంగె
ననిమిషుల్ జయజయధ్వనులతోఁ గీర్తించి, రనుకూలగంధవాహములు వీచె


తే.

నంత బ్రహపురందరాద్యమరవరులు, నారదాదిమహామునినాయకులును
భావనారాయణస్వామి దేవదేవుఁ, బ్రీతిఁ బొగడిరి మంగళగీతములను.

67


వ.

వెండియు నద్దేవు నిట్లని వినుతించిరి.

68

దివిజమునిముఖ్యులు స్వామిని నుతించుట

తే.

దేవదేవ జనార్దన దివిజవినుత, యఖిలలోకైకకారణ యప్రమేయ
భూతభవ్యభవన్నాథ భువనవంద్య, వేదవేద్య రమాధీశ విశ్వనిలయ.

69


సీ.

దివి మస్తకము చంద్రదినకరుల్ కన్నులు, వహ్ని ముఖంబు దేవతలు భుజము
లవని యంఘ్రులు విహాయసము పొక్కిలి దిశల్, శ్రవణంబు లామ్నాయసమితి వాక్కు
లనిలుఁడు ప్రాణంబు యముఁడు మానసము నా, కంబు కంధరమును గచభరంబు
భారతి నాలుక పాథోనిధులు కుక్షి, క్రతుభుక్చికిత్సకుల్ కటితలంబు