పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇది మొదలుగ నీసరసిన్, ముదమునఁ గ్రుంకు లిడుజనుఁడు ముక్తుండై మ
త్పదమునకు నరుగుఁ గొదుకక, తుది భవబంధములఁ బాసి ద్రుహిణతనూజా.

44


తే.

సిద్ధముగ ముక్తికాసారజీవనావ, గాహన జనాఘనిచయ మొక్కటను నూర్పు
లూర్చుచును రోదనంబు సేయుచును జాల, నద్భుతముగఁ బలాయితం బగుచు నుండు.

45


తే.

గణుతి యొనరింప మూఁడులోకములయందుఁ, బావనము లైనతీర్థంబు లేవి గలవ
వన్నియును నిందు వసియించు నహరహంబు, నమరమునిచంద్ర విను సంశయంబు లేదు.

46


తే.

అవని మానవుఁ డిచ్చ లే కైన నీస, రోవరోదక మించుక గ్రోలెనేని
యాక్షణంబున వెసఁ బలాయనము నందు, బ్రహ్మహత్యాదికము లైన పాతకములు.

47


తే.

ముక్తికాసార మనుపేరు మొనసి మనుజుఁ, డాత్మలోపల స్మరియించు నంతమాత్ర
మున నశేషాఘభవబంధములను బాయు, స్నానఫల మేమి చెప్పుదు సంయమీంద్ర.

48


తే.

గ్రహణవేళల విషువసంక్రాంతితిథుల, నయనములయందు మూలాన్వితాహములను
దవిలి స్నానం బొనర్చినధన్యుఁ డొందు, నశ్వమేధసహస్రసమ్యక్ఫలంబు.

49


తే.

పూషుఁడు మకరస్థుం డైనపుడును మాఘ, మాసములయందు నాదిత్యవాసరముల
హరిదినంబుల స్నాన మం దాచరించు, ఫలము వాక్రువ్వ నజనకు నలవి గాదు.

50


సీ.

ఇమ్ముక్తిసరసీతటమ్మున విమలోద, కములచేత నివాపకరణ మాచ
రించుటవలనఁ బితృశ్రేణులకు ముక్తి, కరతలస్థం బయి పరఁగు జహ్ను
తనయాదిపుణ్యతీర్థములనివాపాంజ, లులచేత నయ్యెడుఫలము జనుల
కిచ్చట సిద్ధించు నెన్నంగ గంగాది, పుణ్యతీర్థము లెన్ని భువిని గలుగు


తే.

నన్నియును నిందు వసియించు నహరహంబు, ఘనతరంబుగ నాదుసంకల్పమునను
బితరులకు నెవ్వఁ డిచ్చోటఁ బిండ మొసఁగు, నతఁడు తరియింపఁజేయు స్వపితృజనులను.

51


క.

వటవిటపిక్రింద గయలోఁ, బటుమతిఁ బిండంబు విష్ణుపదమున నిడుమేల్
ఘటియించు ముక్తిసరసీ, తటమునఁ బిండం బొసంగు ధన్యాత్ములకున్.

52


తే.

అఖిలయజ్ఞభోక్త నైననే నిచ్చట, నధివసించి జనుల కఖిలఫలము
లొసఁగుచుందు వినుము యోగికులోత్తమ, మహిమ విస్తరిల్ల నహరహంబు.

53