పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శతధృతిశతమఖముఖులున్, శ్రుతులుం గొనియాడలేనిచో నే నిన్నున్
నుతియింప నెంతవాఁడను, నతరక్షణదీక్ష సర్పనగరాధ్యక్షా.

35


క.

ఏ మనియెద నాభాగ్యము, నీముఖచంద్రోదయమున నెఱి నుప్పొంగెన్
నామానసార్ణవం బిపు, డోమహనీయ ప్రభావయోగిశరణ్యా.

36


వ.

మహాత్మా భవదాలోకనప్రసారణదవానలంబున మదీయపూర్వజన్మసంభృతకిల్బి
షారణ్యంబు దగ్ధం బయ్యె భవదీయకృపాపూరప్రసారణంబున నఘానలతప్తంబులగు
నింద్రియంబులు ప్లావితంబు లయ్యె నింక మదజ్ఞానఘనధ్వాంతవిభాకరుండ వగునిన్ను
నెప్పుడు ధ్యానం బొనర్చెద నీయనంతకల్యాణగుణానీకం బనవరతంబుఁ గీర్తించెద
భవద్భక్తపదాంభోజదర్శనమనోరథుండ నై మూఁడులోకంబుల సంచరించె నని
ప్రార్థించుచున్న నారదునకు భగవంతుం డిట్లనియె.

37

నారదునకు విష్ణు వనుగ్రహంబుఁ జూపుట

సీ.

నీయభిప్రాయంబు నే నెఱుంగుదు వత్స, సకలభూతాంతరాత్మకుఁడ నైన
నా కెద్దియును గానరాకుండునది లేదు, నామాయఁ దరియింప నాకులకు మ
హర్షుల కైన శక్యంబుగా దిట్లు లో, కుల కిది దెలుపుట కొఱకుఁ బూని
యే నీ చేతఁ జేయించితి నింక నీ, వళుకక స్ధైర్యంబు గలిగియుండు


తే.

ధరణి నీపేర నీసరోవర మశేష, పాతకవ్రాతనాశకమై తనర్చు
నిజ్జలంబుల మునిఁగినసజ్జనుండు, పొసఁగ నఖిలశుభంబులఁ బొందుఁజుమ్మి.

38


తే.

అమితకలుషాకరం బగు నట్టిస్త్రీత్వ, మాగతం బయ్యె నిత్తటాకావగాహ
నమున నటు లైన నిది భవన్నామకమున, వఱలుఁబో నీవు మద్భక్తవరుఁడ వగుట.

39


తే.

ఇత్తటాకంబు మది స్మరియించుజనుల, కభిలకలుషాపహరణంబు యతికులేంద్ర
సంతసంబున మునిఁగెడు స్నాతజనుల కెల్ల నిది పుత్త్రసంపత్సమృద్ధిదంబు.

40


క.

విను మత్సంకల్పంబున, మునివల్లభ నీకు స్త్రీత్వము ఘటిల్లె నటుల్
జనులు మత్సంకల్పం, బునఁ గడుశుభసంతతులను బొందుదురుసుమీ.

41


తే.

మునికులోత్తంస యద్భుతంబుగను నీకు, నంగనాత్వవినిర్ముక్తి యయ్యెఁ గాన
నది ధరిత్రీస్థలిఁ బ్రసిద్ధ మగుచు నెపుడు, ముక్తికాసార మనుపేర మొనసియుండు.

42


క.

ఇచ్చెఱువున మునిఁగినజనుఁ, డచ్చెరువుగ దురితరహితుఁ డై శుభఫలముల్
గ్రొచ్చుకొని యనుభవించుచు, విచ్చలవిడిఁ బుత్త్రపౌత్త్రవృద్ధిఁ జెలంగున్.

43