పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అజసహస్రాక్షముఖనిఖిలామరులును, మఱియు సనకాదికాశేషమౌనివరులు
మానసంబుల నెవ్వానిమాయఁ దవిలి, భ్రాంతి వహియింతు రమ్మహాప్రభు నుతింతు.

25


క.

నీరజగర్భాండోదరు, నారాయణు నఖిలమునిజనత్రాణకళా
పారీణు సకలజగదా, ధారు ననాధారు మదిని దలఁతున్ భక్తిన్.

26


తే.

నిఖిలకల్యాణగుణపయోనిధి కృపాబ్ధి, శంఖచక్రగదాధర సర్వఫలద
దేవదేవేశ పరమేశ దీనజనక, నిగమవేద్య ప్రసన్నుఁడ వగుము నాకు.

27


తే.

అజ్ఞుఁడ జడుండ ని న్నెట్టు లభినుతింప, నేర్తు నజ్ఞానమునఁ జేసి నేను విష్ణు
మాయఁ గడచితి నన్నట్టిమాటతప్పు, క్షమ యొనర్చి రయంబ నన్ గావు మభవ.

28


తే.

స్వామి భవదంఘ్రియుగసమాశ్రయణగౌర, వమున మూఢుఁడ నై నేన పల్కినట్టి
తప్పు సహియించి ప్రోవు మాధవ ముకుంద, పుండరీకాక్ష హరి సర్వభువనరక్ష.

29

నారదునకు విష్ణువు ప్రత్యక్ష మవుట

సీ.

సర్వలోకేశ్వర సర్వశరణ్య యా, శ్రితజనవత్సల శ్రీనివాస
పద్మాక్ష మద్భావపరిశోధక కృపాబ్ధి, నారాయణ ముకుంద వారణేంద్ర
వరద గోవింద భవత్కటాక్షామృతాం, చితజలంబుల నభిషిక్తుఁ జేసి
నన్ను రక్షింపు మనాధనాథ యటంచు, దృఢభక్తిమైఁ బ్రస్తుతించుటయును


తే.

నతనిభక్తికిఁ బ్రముదితస్వాంతుఁ డగుచు, భావనారాయణస్వామి పతగరాజ
వాహనుండును గరుణావి ర్ధనుండు, నగుచు నమ్మౌనిమ్రోలఁ బత్యక్ష మయ్యె.

30


వ.

అప్పు డచింత్యాద్భుతరూపలావణ్యయౌవనామృతసముద్రుండును, దరుణారుణాంశు
మండలమండితానర్ఘమణిగణకిరణసంఘాతదేదీప్యమానకిరీటాన్వితోత్తమాంగుండును,
బురందరనీలనికాశకేశపాశుండును, సుప్రకాశుండును, శుచిస్మితసుధాపరిపూర్ణ
పూర్ణిమాచంద్రబింబోపమానవదనుండును, జగత్సదనుండును, మకరకేతననూతన
ధనుర్లతానదృశసవిభ్రమభూయుగళుండును, గంబుకంఠుండును, బ్రభాతసమయ
సముద్దీప్తసహస్రకిరణతరుణమయూఖౌఘప్రభిన్నసితాంభోజలోచనుండును, గలుష
మోచనుండును, గించిదున్మీలితలాలితచాంపేయముకుళాభిరామసునాసుండును,
మహోల్లాసుండును, ధాళధళ్యప్రభాపూరహారిహీరశకలోపమానరదనసముదయుం
డును, సుహృదయుండును, వసంతావసరలసితనవకిసలాయాంభోజరాగసమాసమన్విత
శోణాధరుండును, శ్రీధరుండును, మకరకుండలమణిఘృణివిరాజమానశ్రీకారరేఖా