పుట:సత్యశోధన.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

73



24. పట్టా పుచ్చుకున్నాను - కాని ఆ తరువాత?

బారిష్టరు పట్టాకోసం గదా నేను ఆంగ్లదేశం వెళ్ళింది? దాన్ని గురించి కొంచెం వ్రాస్తాను. అందుకు ఇది మంచి తరుణం.

బారిష్టరు పరీక్షకు రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి నిశ్చిత సమయపాలన. రెండవది - పరీక్షలు వ్రాయడం. నిశ్చిత సమయపాలనకు పట్టే సమయాన్ని పన్నెండు భాగాలుగా విభజించాలి. ఆ సమయపు ఒక్కొక్క భాగంలో జరిగే ఇరవై నాలుగు డిన్నర్లలో కనీసం ఆరు డిన్నర్లలోనైనా పాల్గొనాలి. (అంటే మూడు సంవత్సరాలకు పన్నెండు టరములు. సంవత్సరానికి నాలుగు టరములు. డిన్నర్లు తొంభై ఆరు అన్నమాట! విందుల్లో పాల్గొనడమంటే భోజనం చేయడం అని అర్థం కాదు. నిర్ణీత సమయంలో హాజరై విందు జరిగినంత సేపు ఉండటం అని అర్థం. సామాన్యంగా అంతా పక్వావ్నాలు భుజిస్తారు. కోరిన మద్యం సేవిస్తారు. ఒక్కొక్క విందు వెల రెండు మూడు పౌండ్లు. అది తక్కువే. హోటల్లో అయితే ఒక మద్యానికే అంత వెల చెల్లించవలసి వస్తుంది. నవనాగరికులు కాని హిందువులకు భోజనం కంటే, అందులో ఒక భాగమైన మద్యానికి అంత ధర వుంటుందని అంటే ఆశ్చర్యం కలుగుతుంది.

లండనులో నాకీ విషయం తెలిసినప్పుడు త్రాగుడుకు ఇంత డబ్బు పాడుచేస్తున్నారేమిటి అని బాధ కలిగింది. తరువాత అక్కడి డిన్నర్ల విషయం అర్థమైంది. నేను ఆ డిన్నర్లలో పాల్గొని తిన్నది ఏమీ లేదు. అయితే రొట్టె, బంగాళాదుంపలు, క్యాబేజీ కూర మాత్రం తినేవాణ్ణి. ప్రారంభంలో ఇష్టం లేక వాటిని తినలేదు. రుచి మరిగిన తరువాత యింకా వడ్డించమని అడగడానికి కూడా సాహసించాను.

అక్కడ విద్యార్థులకు పెట్టే ఆహారం కంటే ఉపాధ్యాయులకు పెట్టే ఆహారం మేలుగా వుండేది. నాతోబాటు శాకాహారి ఆయిన పార్సీ యువకుడు మరొకడు వుండేవాడు. మేము శాకాహారులం. అందువల్ల ఉపాధ్యాయులకు పెట్టే శాకాహార పదార్థాల్లో కొన్ని మాకు పెట్టమని విన్నవించుకున్నాం. మా విన్నపం అంగీకరించబడింది. మాకు కూడా శాకాలు, పండ్లు లభించసాగాయి.

నలుగురు విద్యార్థుల బృందానికి రెండు మద్యం సీసాలు ఇస్తారు. నేను మద్యం త్రాగను. అందువల్ల ప్రతివారు తమ బృందంలోకి రమ్మని నన్ను ఆహ్వానించేవారు. నేను వాళ్ళ బృందంలో కలిస్తే నా భాగం కూడా వారే త్రాగొచ్చు. ప్రతి ఇరవైనాలుగు డిన్నర్లకు ఒకటి చొప్పున పెద్ద డిన్నరు ఏర్పాటు చేసేవారు. దానికి