పుట:సత్యశోధన.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

నారాయణ హేమచంద్రుడు

జాబు వ్రాశారు. మేమిద్దరం వెళ్ళాం. నేమ పెద్దలను చూచేందుకు వెళ్ళేటప్పుడు ధరించాల్సిన దుస్తులు ధరించాను. నారాయణ హేమచంద్రుడు మాత్రం తన మామూలు దుస్తులే వేసుకున్నారు. మామూలు కోటు, మామూలు లాగు. నేను కొంచెం పరిహాసం చేశాను. ఆయన నా పరిహాసాన్ని చిటికెలో పరాస్తం చేస్తూ “మీరంతా నాగరికతా లక్షణాల కోసం అర్రులు చాచే పిల్లకాయలు, పిరికిపందలు. మహాపురుషులు హృదయాన్ని చూస్తారు గాని పైపై మెరుగులు చూడరు.” అని అన్నారు.

మేము కార్డినల్ గారి మహల్లో ప్రవేశించాం. అదొక పెద్దనగరంగా వుంది. మేము కూర్చోగానే ఒక బక్కపలుచగా వున్న పొడుగుపాటి వృద్ధుడొకడు వచ్చి కరస్పర్శ కావించాడు. ఆయనే కార్డినల్‌గారని తెలిసిపోయింది.

వెంటనే నారాయణ హేమచంద్రుడు అభివందనాలు సమర్పించి “నేను మీ సమయం అపహరించను. నేను మీ కీర్తిని గురించి చాలా విన్నాను. మీరు సమ్మె కట్టిన పనివాళ్ళకు ఉపకారం చేశారు. ఇక్కడకు వచ్చి మిమ్మల్ని అభినందించాలని బుద్ధి పుట్టింది. ప్రపంచంలో సాధు సజ్జనుల దర్శనం చేసుకోవడం నాకు అలవాటు. అందువల్ల మీకీ శ్రమ కలిగించాను.” అని గబగబా అన్నాడు.

ఆయన గుజరాతీ మాటల్ని నేను ఇంగ్లీషులోకి మార్చాను. “మీ రాకకు సంతోషిస్తున్నాను. మీకు ఇచట నివాసం సుకరం అవుగాక, భగవంతుడు మీకు మేలు చేయుగాక." అని ఆయన వెంటనే వెళ్లిపోయాడు.

ఒకరోజున నారాయణ హేమచంద్రుడు ధోవతి కట్టుకొని, షర్టు తొడుగుకొని నా బసకు విచ్చేశాడు. ఆ యింటి యజమానురాలు తలుపు తీసి చూడగానే దడుచుకున్నది. (నేను మాటిమాటికీ మకాం మారుస్తూ వుంటాననీ వ్రాశానుగదా! ఆ క్రమంలో ఈ మధ్యనే ఈ ఇంటికి వచ్చాను. ఈ ఇంటి యజమానురాలు నారాయణ హేమచంద్రుణ్ణి అదివరకు చూడలేదు) ఆమె తత్తరపడుతూ వచ్చి “ఎవరో పిచ్చివాడిలా వున్నాడు. మీ కోసం వేచివున్నాడు” అని చెప్పింది. నేను ద్వారం దగ్గరికి వెళ్ళాను. నారాయణ హేమచంద్రుడు నిలబడివున్నాడు. నివ్వెరపోయాను. ఆయన ఎప్పటిలాగానే నవ్వుతూ వున్నాడు.

“బజార్లో పిల్లలు మిమ్మల్ని చూచి అల్లరి చేయలేదా?”

“వాళ్ళు నావెంటబడ్డారు. కాని నేను వారివంక కన్నెత్తి చూడలేదు. దానితో వాళ్ళు వెళ్ళిపోయారు.”

లండనులో కొంతకాలం వుండి నారాయణ హేమచంద్రుడు తరువాత పారిస్