పుట:సత్యశోధన.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

67

దైవసహాయాన్ని గురించిగాని తెలియదు. నన్ను అప్పుడు దేవుడే రక్షించాడని అనుకోవడం తెలిసీ తెలియని స్థితే. నిజానికి ఇక్కట్ల సమయంలో ఎన్నో పర్యాయాలు నన్ను భగవంతుడే రక్షించాడు. జీవితంలో అనేక రంగాల్లో ఇట్టి అనుభవం నాకు కలిగింది. “భగవంతుడు నన్ను రక్షించాడు” అను మాటకు సరియైన అర్థం ఇప్పుడు నాకు బాగా బోధపడింది. అయినా యింకా పూర్తిగా తెలుసుకోలేక పోతున్నానని కూడా నేను ఎరుగుదును. అనుభవం ద్వారా ఆ విషయం తెలుసుకోవడం అవసరం. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయత్నాల యందును, లాయరు పనియందును, సంస్థల్ని నడపడంలోను, రాజకీయ వ్యవహారాల్లోను అనేక విషమ ఘట్టాలలోను భగవంతుడు నన్ను రక్షించాడని చెప్పగలను. ఉపాయాలు అడుగంటినప్పుడు, సహాయకులు వదిలివేసినప్పుడు, ఆశలుడిగినప్పుడు ఎటునుండో ఆ సహాయం అందుతుందని నా అనుభవం. స్తుతి, ఉపాసన, ప్రార్థన ఇవి గ్రుడ్డి నమ్మకాలు కావు. అవి ఆహార విహారాదుల కంటే కూడా అధిక సత్యాలు. అవే సత్యాలు, మిగతావన్నీ అసత్యాలే అని కూడా అనవచ్చు. అది అతిశయోక్తి కాజాలదు,

ఈ ఉపాసన, ఈ ప్రార్థన కేవలం వాక్ ప్రతాపం కాదు. దీనికి మూలం జిహ్వకాదు, హృదయం. అందువల్ల భక్తితో నింపి హృదయాన్ని నిర్మలం చేసుకుంటే మనం అనంతంలోకి ఎగిరిపోగలం, ప్రార్థనకు జిహ్వతో పనిలేదు. అది స్వభావానికి సంబంధించినది. అదొక అద్భుతమైన వస్తువు, విశాల రూపాలలో నున్న మలాన్ని, అనగా కామాది గుణాల్ని శుద్ధి చేయుటకు హృదయపూర్వకమైన ఉపాసన ఉత్తమ సాధనమని చెప్పుటకు నేను సందేహించను. అయితే అట్టి ఉపాసన అమిత వినమ్రతా భవంతో చేయాలి.


22. నారాయణ హేమచంద్రుడు

ఆరోజుల్లో నారాయణ హేమచంద్రుడు సీమకు వచ్చారని తెలిసింది. ఆయన మంచి రచయిత అని విన్నాను. నేషనల్ ఇండియన్ అసోసియేషన్‌కు సంబంధించిన మానింగ్ కన్యాగృహంలో వారిని కలిశాను. నేను ఇతరులతో కలిసి వుండలేనని మానింగ్ కన్యకు తెలుసు. నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా మాట్లాడించితే తప్ప మౌనంగా వుండేవాణ్ణి. ఆమె ఆయనకు నన్ను పరిచయం చేసింది. ఆయనకు ఇంగ్లీషురాదు. ఆయనది వింతవాలకం. వికారంగా వుండే ఫాంటు అట్టిదే మడతలు బడిన మురికి బూడిదరంగు పార్సీ పద్ధతి కోటు ధరించివున్నాడు. నెక్‌టైగాని, కాలరుగాని లేదు. కుచ్చులు గల ఉన్ని టోపీ పెట్టుకున్నాడు. పొడుగుపాటి గడ్డం.