పుట:సత్యశోధన.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

నిర్భలుడికి బలం రాముడే

సుమత్‌లో శాకాహారసభ జరిగింది. నేను నా మిత్రుడు ఆ సభకు ఆహ్వానింపబడ్డాం. పోర్టు సుమతు సముద్రపు రేవు. ఆ ఊళ్ళో నావికజనం ఎక్కువగా వున్నారు. అచట చెడునడత గల స్త్రీలు వున్నారు. అయితే వాళ్ళు వేశ్యలు కారు. కాని వాళ్ళకు నీతి నియమం ఏమీలేవు. అట్టి వాళ్ళ యింట్లో మేము బస చేశాము. సన్మానసంఘం వారికి ఆ విషయం తెలియదు. ఎప్పుడో ఒకసారి పోర్టు సుమతు వంటి పట్టణానికి వచ్చి వెళ్లే మావంటి బాటసార్లకు అక్కడ ఏది మంచి బసయో, ఏది చెడు బసయో తెలుసుకోవడం కష్టం. సభలో పాల్గొని రాత్రి మేము ఇంటికి చేరాము. భోజనం అయిన తరువాత మేము పేకాట ప్రారంభించాము. ఆంగ్లదేశంలో గొప్పగొప్పవారి ఇళ్ళల్లో కూడా గృహిణిలు అతిథులతో పేకాట ఆడటం ఆచారం. సామాన్యంగా పేకాటలో అంతా ఛలోక్తులు విసురుకుంటూ వుంటారు. అయితే అందు దోషం ఉండదు. కాని మా పేకాటలో భీభత్స వినోదం ప్రారంభమైంది.

నా స్నేహితుడు ఇట్టి వ్యవహారంలో ఆరితేరినవాడని నాకు తెలియదు. నాకు కూడా ఈ వినోదంలో ఆనందం కలిగింది. నేను కూడా అందులో దిగాను. మాటలు దాటి వ్యవహారం చేతల్లోకి దిగింది. పేక ప్రక్కన పెట్టివేశాం. ఇంతలో భగవంతుడు నా స్నేహితుని హృదయంలో ప్రవేశించాడు. “నీవా! ఈ ఘోరకలిలోనా? ఈ పాపకూపంలోనా! నీకు ఇక్కడ చోటులేదు. పో! లేచిపో!” అని అరిచాడు. సిగ్గుతో నా తల వంగిపోయింది. అతడి ఆదేశాన్ని శిరసావహించాను. హృదయంలో అతడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మా అమ్మగారి ముందు చేసిన ప్రమాణం జ్ఞాపకం వచ్చింది. నేను లేచి బయటికి పరిగెత్తాను. నా గదిలోకి దూరాను. వేటగాని బారినుండి తప్పించుకున్న లేడిలా గుండె గజగజ వణికిపోయింది.

పరాయి ఆడదాని విషయంలో ఈ విధంగా ప్రధమ పర్యాయం నాకు వికారం కలిగింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. అనేక ఆలోచనలు నన్నావహించాయి. ఈ ఇంటి నుంచి పారిపోనా? ఈ పట్టణం వదలి వెళ్ళిపోనా? నేనున్నదెక్కడ? నేను జాగ్రత్తగా వుండకపోతే నా గతి ఏమవుతుంది? ఈ రకమైన ఆలోచనలతో సతమతం అయి, తరువాత నుండి అతి జాగ్రత్తగా మసలుకోసాగాను, ఆ ఇంటినేగాక వెంటనే పోర్టు సుమతును వదలి వెళ్ళిపోవడం మంచిదని భావించాను. సభలు ఇంకా రెండు రోజులు జరుగుతాయని తెలిసింది. ఆ మర్నాడు సాయంత్రమే నేను పోర్టుసుమతును వదిలివేసినట్లు నామిత్రుడు మరికొంత కాలం అక్కడే ఉన్నట్లు గుర్తు.

ఆ సమయంలో నాకు మతాన్ని గురించి గాని, దేవుణ్ణి గురించిగాని,