పుట:సత్యశోధన.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

63

ఈ రెండు శ్లోకాలు నా మనస్సునందు నాటుకున్నాయి. ఇప్పటికీ వాటి ధ్వని నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. భగవద్గీత అమూల్యమైన గ్రంథమను విశ్వాసం రోజురోజుకు నాలో పెరగసాగింది. తత్వజ్ఞానంలో దానితో సమానమైన గ్రంథం మరొకటి లేదను నమ్మకం నాకు కలిగింది. నా మనస్సు చెదిరినప్పుడు భగవద్గీత నాకు ఎంతో సహాయం చేసింది. ఆంగ్లగీతానువాదాలన్నింటిని దరిదాపుగా నేను చదివాను. అర్నాల్డుగారి ఆంగ్లగీతానువాదమే ఉత్తమమైనదని నా అభిప్రాయం. అతడు మూలానుయాయి. అది అనువాదంలా వుండదు. ఆ మిత్రులతో కలిసి గీత చదివానే గాని క్షుణ్ణంగా అర్థం చేసుకొని చదివానని చెప్పలేను. ఆ తరువాత కొంతకాలానికి నాకు అది నిత్యపారాయణ గ్రంథం అయింది,

ఆర్నాల్డుగారు “లైట్ ఆఫ్ ఏషియా” (బుద్ధచరితం) చదవమని చెప్పారు. అంతకు ముందు ఆర్నాల్డుగారు ఒక్క గీతనే ఆంగ్లంలోకి అనువదించారని అనుకున్నాను. కాని బుద్ధ చరిత్రను మాత్రం క్రింద పెట్టడానికి మనస్సు అంగీకరించేది కాదు. వారు ఒకనాడు నన్ను బ్లావట్‌స్కీగారికీ, అనిబిసెంట్ సతిగారికి పరిచయం చేశారు. బిసెంట్‌గారు అప్పుడు దివ్య జ్ఞానసమాజంలో చేరారు. అప్పుడు ఆమెను గురించి పత్రికల్లో చమత్కారంగా చర్చలు జరుగుతూ ఉండేవి. నేను ప్రతిచర్చను ఆసక్తితో చదువుతూ వున్నాను. వారు నన్ను దివ్యజ్ఞాన సమాజంలో చేరమని ఆహ్వానించారు. “నా మతాన్ని గురించే నాకు సరిగా తెలియదు. అట్టి స్థితిలో ఇతర మతాలలో ఎలా చేరడం? అని చెప్పి వినమ్రంగా ఆమె ఆహ్వానాన్ని నిరాకరించాను. వారు చెప్పినమీదట నేను “కీ టు థియాసఫీ” అను మదాం బ్లావట్ స్కీ రచించిన గ్రంథాన్ని చదివినట్లు గుర్తు. ఆ గ్రంథం చదివిన తరువాత హిందూ మతగ్రంథాలు చదవాలనే కోరిక నాకు కలిగింది. మూఢ నమ్మకాలమయం హిందూ మతం అని క్రైస్తవ మతబోధకులు చేసే ప్రచారం తప్పు అను నమ్మకం కూడా నాకు కలిగింది.

ఆ రోజుల్లోనే మాంచెస్టరు నుండి వచ్చిన ఒక మంచి క్రైస్తవుడు శాకాహారశాలలో నన్ను కలిసి క్రైస్తవమత ప్రాశస్త్యాన్ని గురించి వివరించాడు. రాజకోటలో నేనెరిగిన క్రైస్తవ పాదరీల బోధల్ని గురించి ఆయనకు చెప్పాను. అది విని ఆయన దుఃఖపడి “నేను శాకాహారిని. నేను మద్యం తాగను. నాతోటి క్రైస్తవులు మద్యం త్రాగుతున్నారు. మాంసం తింటున్నారు. కాని ఈ రెండింటిని తినమని బైబిలు చెప్పలేదు. బైబిలు చదివితే మీకే తెలుస్తుంది.” అని అన్నాడు. అందుకు నేను అంగీకరించాను. ఆయన నాకు ఒక బైబిలు గ్రంథం ఇచ్చాడు. ఆయనే బైబిలు అమ్మినట్లు, పటాలు,