పుట:సత్యశోధన.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

అసత్య వ్రణం

సామాన్య స్థితిగతులు కలిగిన వృద్ధ వితంతువు కనబడింది. ఇంగ్లాండులో ఇది నాకు మొదటి సంవత్సరం. అక్కడ ఆహారపదార్థాల వివరమంతా ఫ్రెంచి భాషలో వున్నది. నాకు బోధపడలేదు. ఆ వృద్ధురాలి బల్ల దగ్గరే నేనూ కూర్చున్నాను. ఇతడు క్రొత్తవాడు. గాబరా పడుతున్నాడని ఆమె గ్రహించింది. ఆమె మాటలు ప్రారంభించింది.

“నీవు క్రొత్తవాడిలా వున్నావు. సంకోచిస్తున్నట్లున్నావు. తినేందుకు ఇంత వరకు నీవు ఆర్డరు ఇవ్వలేదు. కారణం?” అని అడిగింది. నేను ఆహారపదార్థాల పట్టిక చూస్తున్నాను. వడ్డన చేసేవాణ్ణి పిలిచి మాట్లాడదామని అనుకొంటున్నప్పుడు ఆమె మాట్లాడింది. ఆమెకు ధన్యవాదాలు సమర్పించి “ఈ పట్టికలో ఆహారపదార్థాలను గురించి వివరం తెలుసుకోలేకపోతున్నాను. నేను శాకాహారిని. అందువల్ల వీటిలో ఏమేమి మాంసం కలవనివో తెలుసుకో కోరుతున్నోను” అని అన్నాను.

“ఇదా విషయం! నేను నీకు సహాయం చేస్తాను. పదార్థాల వివరం చెబుతాను. నీవు తీసుకోగల పదార్థాలు చెబుతాను.” అని అన్నది. నేను అందుకు అంగీకరించాను. అప్పటినుండి మాకు దగ్గర సంబంధం ఏర్పడింది. నేను ఆంగ్లదేశంలో వున్నంతవరకే గాక, అక్కడ నుండి వచ్చిన తరువాత కూడా మా సంబంధం చాలాకాలం వరకు చెక్కు చెదరలేదు. ఆమెది లండను. అక్కడి తన అడ్రసు నాకు ఇచ్చింది. ప్రతి ఆదివారం భోజనానికి తనింటికి రమ్మని ఆహ్వానించింది. ఇతర సమయాల్లో కూడా నన్ను భోజనానికి ఆహ్వానిస్తూ ఉండేది. నాకు గల సిగ్గును బిడియాన్ని పోగొట్టేందుకు బాగా సహకరించింది. యువతులను పరిచయం చేసింది. వాళ్ళతో మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది. ఒక స్త్రీ ఆమె దగ్గరే ఉండేది. ఆమెను నా దగ్గరకు పంపి ఆమెతో మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది. అప్పుడప్పుడు మమ్మల్ని ఇద్దరినీ ఒంటరిగా ఉండనిచ్చేది.

ప్రారంభంలో ఈ తతంగం నాకు నచ్చలేదు. ఏం మాట్లాడాలో తోచేది కాదు. ఎగతాళి మాటలు ఏం మాట్లాడను? ధైర్యం చెబుతూ ఉండేది. అంటే నేను స్త్రీ సాంగత్యానికి “సిద్ధం” చేయబడుతున్నానన్నమాట. ఆదివారం కోసం ఎదురు చూడటం ప్రారంభించేవాణ్ణి. ఆ స్త్రీతో మాట్లాడటం ఎంతో ఇష్టంగా వుండేది.

వృద్ధురాలు కూడా నన్ను స్త్రీ వ్యామోహంలోకి నెట్టసాగింది. మా యీ సాంగత్యం ఆమెకు కూడా ఇష్టమేనన్నమాట. మా ఇద్దరి మేలు ఆమె కూడా కోరియుంటుంది. ఇక నేను ఏం చేయాలి? నాకు పెండ్లి అయిందని ఇదివరకే చెప్పివుంటే బాగుండేది కదా! అప్పుడు ఆమె నా వంటివాడి పెండ్లి విషయం యోచించేదా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. నిజం తెలియజేస్తే ముప్పు తప్పిపోతుంది గదా! ఈ విధంగా యోచించి