పుట:సత్యశోధన.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

59


వెంటబడి అసత్య జీవితం గడిపేందుకు సిద్ధపడతారు. ఆంగ్లేయులు అందుకు అంగీకరించరు. భారతీయులు ఇలా చేయడానికి సాహసిస్తారు. నేనూ ఇలాంటి వలలో పడ్డాను. నాకు పెండ్లి అయ్యింది. ఒక బిడ్డకూడా పుట్టాడు. అయినా అక్కడ బ్రహ్మచారిగా వున్నాను. అట్టి నటన వల్ల నాకేమీ ఆనందం కలుగలేదు. అయితే సిగ్గు, బిడియాలు నన్ను కాపాడాయి. నేను మాట్లాడకుండా వుంటే నాతో ఎవతె మాట్లాడుతుంది? మొగవాడు ముందుడుగు వేస్తేనే గదా ఆడమనిషి కూడా ముందుకు వచ్చేది.

నాకు పిరికితనంతో బాటు బిడియం కూడా అధికంగా వుండేది. వెంటనర్‌లో నేను వున్న కుటుంబంలో ఇంటి యజమానురాలి కూతురు, తమ అతిథుల్ని షికారుకు తీసుకువెళుతూ వుండేది. అది అక్కడి ఆచారం. ఆమె ఒకనాడు నన్ను దగ్గరలోనే వున్న గుట్టల మీదకు తీసుకువెళ్ళింది. అసలు నాది వడిగల నడక. ఆమెది నా కన్నా ఎక్కువ వడిగల నడక. ఆ మాటలు యీ మాటలు చెబుతూ సన్ను వడివడిగా లాక్కు వెళ్ళసాగింది. నేనూ కబుర్లు చెబుతూనే ఉన్నాను. ఒకప్పుడు ఔను అని, మరొకప్పుడు కాదు అని, ఇంకొకప్పుడు ఆహా! ఎంత బాగా ఉంది? అంటూ ఆమె వెంట నడుస్తున్నాను. ఆమె పిట్టలా తుర్రున పోతూ ఉంది. ఇంటికి పోయేసరికి ఎంత సేపవుతుందోనని ఆలోచనలో పడ్డాను. అయినా నేను వారించకుండా ఆమె వెంటపడి పోతూనే ఉన్నాను. ఒక పర్వత శృంగం మీదకు ఎక్కాం. మడమల జోడు తొడుక్కుని ఇరవై లేక ఇరవై అయిదేళ్ళు వయస్సులో నున్న ఆ యువతి రివ్వున క్రిందికి దిగసాగింది. క్రిందికి దిగడానికి నేను క్రిందుమీదులవుతూ వున్నాను. నా బాధ ఆమె కంట బడుతుందేమోనని నాకు సిగ్గు. ఆమె వెనక్కి తిరిగి నవ్వుతూ ఇటు దిగు, అటు దిగు అంటూ ఊతం ఇచ్చి దింపనా అంటూ రెచ్చగొట్టసాగింది. అసలే ఎక్కడపడతానో అని భయం. అయినా ఆమె పట్టుకుంటే నేను ఆమె ఊతంతో దిగటమా? చివరికి అతికష్టం మీద కొన్నిచోట్ల పాకి, కొన్నిచోట్ల కూర్చొని ఏదో విధంగా క్రిందికి ఊడిపడ్డాను. ఆమె శభాష్ శభాష్ అంటూ బిగ్గరగా నవ్వి నన్ను బాగా సిగ్గుపడేలా చేసింది.

అయితే అన్ని చోట్ల ఇలా ఆమె బాహువుల్లో పడకుండా తప్పించుకోవడం సాధ్యమా? అయితే భగవంతుడు నా అసత్య వ్రణాన్ని మాన్పాలని భావించాడు. నన్ను రక్షించాడు. బ్రైటన్ అను గ్రామం వెంటనర్ గ్రామం మాదిరిగ సముద్రం ఒడ్డున గల పర్యటనా కేంద్రం. అక్కడికి ఒక పర్యాయం నేను వెళ్ళాను. ఇది వెంటనర్ వెళ్ళడానికి ముందు జరిగిన ఘట్టం. నేను బ్రైటన్‌లో గల ఒక చిన్న హోటలుకు వెళ్ళాను. అక్కడ