పుట:సత్యశోధన.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

53

విభాగంలో తొమ్మిది పెన్నీలకు ఒక రొట్టెముక్క. మరో మూడు పదార్థాలు పెడతారు. నేను ఖర్చు తగ్గించుకోవాలని ప్రయత్నం ప్రారంభించినప్పటి నుండి రెండో విభాగంలోకే వెళ్ళి ఆహారం పుచ్చుకోవడం ప్రారంభించాను. ఈ ప్రయోగాలతో పాటు కొన్ని చిన్న ప్రయోగాలు కూడా ప్రారంభించాను. కొంత కాలం గంజి పదార్థాలు మానివేశాను. కొంతకాలం రొట్టె, పండ్లు మాత్రమే తింటూ వున్నాను. కొంతకాలం జున్ను, పాలు, గ్రుడ్లు పుచ్చుకుంటూ వున్నాను. ఈ చివరి ప్రయోగం పదిహేనురోజులకంటే మించి సాగలేదు. గంజిలేని పదార్థాలు తినాలని బోధించిన సంస్కర్త గ్రుడ్లు తినడం మంచిదని, అది మాంసాహారం కాదని సమర్థించాడు. గ్రుడ్లు తింటే జీవ జంతువులకు హానికలుగదు అని మొదట భావించాను. అందువల్ల కొంచెం కక్కుర్తి పడ్డాను. అయితే ఈ విధానం ఎక్కువ కాలం సాగలేదు. నా ప్రమాణానికి క్రొత్త వ్యాఖ్యానం ఎలా చెప్పను? ప్రమాణం చేయించిన మా అమ్మగారి ఉద్దేశ్యం నాకు తెలియదా? గ్రుడ్లు కూడా మాంసమనే మా అమ్మ ఉద్దేశ్యం. ఈ ప్రమాణంలో దాగియున్న సత్యం గ్రహించి వెంటనే గ్రుడ్లను, వాటికి సంబంధించిన ప్రయోగాల్ని విరమించుకున్నాను.

ఇంగ్లాండులో మాంసాన్ని గురించిన మూడు లక్షణాలు తెలుసుకున్నాను. మొదటి లక్షణం ప్రకారం పశు, పక్షుల మాంసమే మాంసం. ఈ లక్షణాన్ని గుర్తించిన శాకాహారులు అట్టి మాంసం త్యజించి చేపల్ని తినడం ప్రారంభించారు. ఇక గ్రుడ్లు కూడా పుచ్చుకునే వారిని గురించి చెప్పనవసరం లేదనకుంటాను. రెండవ లక్షణం ప్రకారం చేపల్ని కూడా తినకూడదు. కాని గ్రుడ్లు తినవచ్చు. ఇక మూడవ లక్షణం ప్రకారం సమస్త జీవజంతువుల మాంసం, వానివల్ల ప్రభవించే పదార్థాలు అంటే గ్రుడ్లు, పాలు మొదలైనవి కూడా మాంసం క్రింద లెక్కే. ఇందు మొదటి లక్షణం అంగీకరిస్తే నేను చేపలు కూడా తినవచ్చు. అయితే మా అమ్మ అభిప్రాయమే సరియైనదని నిర్ణయానికి వచ్చాను. ఆమె ఎదుట చేసిన ప్రయాణం ప్రకారం నేను గ్రుడ్లు కూడా తినకూడదు. అందువల్ల గ్రుడ్లు తినడం మానివేశాను. దీనివల్ల నాకు బాగా శ్రమ కలిగింది. సూక్ష్మంగా లోతుకు దిగి పరిశీలించి చూస్తే శాకాహారశాలల్లో లభించే చాల ఆహార పదార్థాలలో గ్రుడ్లు కలుస్తాయని తేలింది. అందువల్ల గ్రుడ్లు వాడిందీ లేనిదీ తెలుసుకోవడం కోసం వడ్డన చేసేవాణ్ణి పిలిచి అడగలవలసిన అవసరం కలిగింది. కేకుల్లోను, పుడ్డింగుల్లోను గ్రుడ్లు కలుస్తూ ఉండటం వల్ల అలా అడిగి తెలుసుకోవలసి వచ్చింది. దానితో ఇంకా కొన్ని చిక్కులు తొలిగాయి, సాదా పదార్థాలు మాత్రమే తినవలసిన ఆవశ్యకత ఏర్పడింది. నాలుక రుచి మరిగిన అనేక