పుట:సత్యశోధన.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ఆహారంలో మార్పులు - ప్రయోగాలు

పరిశీలించి వ్రాశారు, “మానవుడు జంతువులకంటే అధికుడు. అందువల్ల వాటిని కాపాడటం అవసరం. ఒక మనిషి మరో మనిషికి ఏవిధంగా సహాయం చేస్తాడో అదే విధంగా మిగతా ప్రాణులకు కూడా సహాయం చేయాలి” అని వ్రాసి అది మానవుని నైతిక ధర్మమని నిర్ధారించారు. మనిషి తినడానికి రుచే ప్రధానం కాదని, బ్రతకడానికేనని ప్రకటించి ఇది సత్యమని నిర్ధారించారు. ఆ గ్రంథ రచయితల్లో చాలామంది మాంసాన్నేగాక, గ్రుడ్లను పాలను కూడా నిషేధించారు. వారు స్వయంగా ఆ విధంగా నడుచుకున్నారు. కొందరు మానవశరీర నిర్మాణాన్ని బట్టి వండిన పదార్థాలు సరిపడవనీ, పళ్ళు వచ్చేవరకు పిల్లలకు తల్లిపాలు త్రాగించాలనీ, తరువాత పండ్లు ఫలాలు తినిపించాలని వ్రాశారు. వైద్యశాస్త్ర ప్రకారం ఊరగాయలు, పచ్చళ్ళు, పోపులు, మసాలాలు మొదలగు వాటిని పరిత్యజించాలని చెప్పారు. శాకాహారం అందరికీ అందుబాటులో వుంటుందనీ, ఖర్చు కూడా తక్కువ అవుతుందని నిర్ణయించారు. ఈ నాలుగు విషయాలు నా అనుభవంలోకి కూడా వచ్చాయి. శాకాహార భోజనశాలల్లో ఈ నియమాల్ని పాటించేవారిని చాలామందిని కలుసుకున్నాను. ఆంగ్లదేశంలో శాకాహార ప్రచార సంఘాలు కూడా చాలా ఉన్నాయి. వారు ఒక వారపత్రికను ప్రకటిస్తున్నారు. నేను ఆ సంఘంలో చేరాను. ఆ పత్రికకు చందాదారుణ్ణి అయ్యాను. కొద్ది రోజులకే ఆ సంఘ కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఎన్నికైనాను. శాకాహార నియమాన్ని నిష్టతో అమలుపరిచే చాలామంది ప్రముఖులతో నాకు పరిచయం కలిగింది. ఆహారం విషయంలో ప్రయోగాలు మొదలుపెట్టాను,

ఇంటి నుండి తెప్పించిన చిరుతిండ్లు, ఊరగాయలు తినడం మానివేశాను. మనస్సు మారినందున వాటిపై నాకు విరక్తి కలిగింది. వెనక రిచ్‌మండులో వున్నప్పుడు నా జిహ్వకు చప్పగా వున్న మసాలా లేని స్పెనక్ (బచ్చలి) ఇప్పుడు రుచిగా ఉంది. ఈ విధమైన ప్రయోగాలవల్ల ఆహార పదార్థాల రుచి విషయంలో మనస్సు ప్రధానం గాని, జిహ్వ కాదని తేలింది. ఆర్థిక దృష్టి కూడా నా విషయంలో బాగా పనిచేసింది. ఆ రోజుల్లో కొందరు కాఫీ, టీలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని భావించి కోకో పుచ్చుకోవడం ప్రారంభించారు. నేను కూడా తిండి శరీర నిర్వహణకేనని నిశ్చయించి టీ, కాఫీలు మానివేసి కోకో పుచ్చుకోసాగాను.

శాకాహార భోజనశాలలో రెండు విభాగాలు ఉండేవి. ఒక విభాగంలో కావలసిన పదార్థాలు తిని, తిన్న పదార్థాలకు మూల్యం చెల్లించాలి. పూటకు మనిషికి రెండు షిల్లింగులు దాకా ఖర్చు అవుతుంది. ఈ విభాగానికి డబ్బు గలవాళ్ళు వెళతారు. రెండో