పుట:సత్యశోధన.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

45

మా అమ్మగారి దగ్గర నేను చేసిన ప్రతిజ్ఞ నాకు ఎంతో ఆనందం కలిగించింది. జనమంతా మాంసాహారులైతే మంచిదని ఒకప్పుడు భావించేవాణ్ణి. తరువాత కేవలం ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం మాంసం త్యజించాను. భవిష్యత్తులో బహిరంగంగా మాంసం తిని ఇతరులను కూడా మాంసం తినమని చెప్పి ప్రోత్సహించాలని భావించాను. కాని ఇప్పుడు శాకాహారిగా ఇతరులను కూడా శాకాహారులుగా మార్చాలనే కోరిక నాకు అమితంగా కలిగింది.

15. ఆంగ్ల వేషం

రోజురోజుకి నాకు శాకాహారం మీద నమ్మకం పెరగసాగింది. సాల్ట్‌గారి పుస్తకం చదివిన తరువాత ఆహార విషయాలను గురించిన పుస్తకాలు చదవాలనే కాంక్ష పెరిగింది. దొరికిన పుస్తకాలన్నీ చదివాను. హోవర్డు విలియమ్స్‌గారు వ్రాసిన “ఎతిక్స్ ఆఫ్ డైట్” అను గ్రంథం వాటిలో ఒకటి. అందు ఆదికాలం నుండి నేటి వరకు మనుష్యుల ఆహారాన్ని గురించిన చర్చ విస్తారంగా వుంది. పైథాగరస్, జీసస్ మొదలుకొని నేటి వరకు వున్న మతకర్తలు, ప్రవక్తలు అంతా ఆకులు, కూరలు, అన్నం తినేవారని రుజువు చేయబడింది. డాక్టర్ ఎల్లిన్‌సన్ గారు ఆరోగ్యాన్ని గురించి వ్రాసిన రచనలు ఉపయోకరమైనవి. ఆయన రోగుల ఆహార పద్ధతులను నిర్ధారించి తద్వారా రోగాల్ని కుదిర్చే ప్రణాళికను ఒక దానిని రూపొందించాడు. అతడు శాకం, అన్నం తినేవాడు, తన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆ ఆహారమే నిర్ధారించేవాడు. ఈ గ్రంథాలన్నీ చదవడం వల్ల ఆహార పరీక్ష నా జీవితంలో ప్రధాన స్థానం ఆక్రమించింది. ప్రారంభంలో ఆరోగ్యమే ఆహార పరీక్షకు ప్రధాన కారణం అయినా తరువాత ఈ శాకాహార విధానానికి ధర్మ దృష్టియే ప్రధాన లక్ష్యం అయింది.

అయినా నా మిత్రునికి నా ఆహారాన్ని గురించి బెంగపోలేదు. మాంసం తినకపోతే చిక్కిపోయే ప్రమాదం వుందనీ, ఇంగ్లీషువారితో కలిసి వుండలేకపోవచ్చుననీ భావించి నన్ను మాంసం తినమని వత్తిడి చేయడం ప్రారంభించాడు. నాయందు గల ప్రేమాధిక్యం వల్లనే ఆయన ఈ విధంగా చేశాడు. శాకాహార గ్రంథాలు విస్తారంగా చదవడం వల్ల నాకు చెడు జరుగుతుందేమోనని భయపడ్డాడు. ముఖ్యమైన అసలు చదువు మాని ఆహార పదార్థాలను గురించిన గ్రంధాలు చదువుతూ కాలమంతా వ్యర్థం చేసుకొంటాడేమోనను భావం ఆయనకు కలిగింది. దానితో చివరి ప్రయత్నం గట్టిగా చేయాలని నిర్ణయించుకొన్నాడు. ఒకనాడు నన్ను నాటకానికి రమ్మంటే వెళ్ళాను. నాటకం చూడబోయే ముందు హాల్‌బర్న్ రెస్టారెంటులో భోజనం ఏర్పాటు