పుట:సత్యశోధన.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

నా అభిరుచి

యజమానురాలు వితంతువు. ఆమెకు నా ప్రమాణాన్ని గురించి తెలియజేశాను. ఆమె నన్ను జాగ్రత్తగా చూస్తానని మాట ఇచ్చింది. నేను అక్కడ ప్రవేశించాను. కాని అక్కడ కూడా మాకు కటిక ఉపవాసమే. తినుబండారాలు కొద్దిగా పంపమని ఇంటికి వ్రాశాను. అవి యింకా రాలేదు. ఏ వస్తువు తినడానికి రుచిగా వుండేదికాదు. ఆమె పదార్థం వడ్డించి యిది బాగుందా అని అడుగుతూ వుండేది. కాని ఆ పదార్థం గొంతు దిగేది కాదు. ఆమె చేయగలిగింది మాత్రం ఏముంటుంది? నాకు బిడియం తగ్గలేదు. వడ్డించిన దానికంటే మించి యింకా వడ్డించమని అడగటానికి బిడియంగా వుండేది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళు చెరొక రొట్టెముక్క బలవంతాన నా ప్లేటులో వుంచేవారు. అయితే అంతకు రెండింతలైతే గాని నా ఆకలి తీరదని పాపం వాళ్ళకు తెలియదు.

కొంతకాలానికి నాకు నిలకడ చిక్కింది. ఇంకా నేను, చదువు ప్రారంభించలేదు. శుక్లా గారి ధర్మమా అని వారిచ్చిన వార్తాపత్రికలు చదవడం ప్రారంభించాను. ఇండియాలో ఎప్పుడూ అట్టి పని చేయలేదు. ఇక్కడ ప్రతిరోజూ వార్తా పత్రికలు చదివి వాటి యందు అభిరుచి కలిగించుకున్నాను. డైలీ న్యూస్, డైలీ టెలిగ్రాఫ్, పాల్‌మాల్ గెజెట్ రోజూ చూడసాగాను. వాటిని చదవడానికి గంట కంటె ఎక్కువ సమయం పట్టేది కాదు.

ఇక ఊరు తిరగడం ప్రారంభించాను. మాంసం లేని హోటల్ళు ఎక్కడ వుంటాయా అని అన్వేషణ ప్రారంభించాను. మా ఇంటి యజమానురాలు అట్టివి కొన్ని వున్నాయని చెప్పింది. రోజూ పది, పన్నెండు మైళ్ళు తిరిగి చవుక రకం దుకాణాల్లో కడుపు నిండ రొట్టె తినడం ప్రారంభించాను. అయినా తృప్తి కలుగలేదు. ఇలా తిరుగుతూ వుంటే ఒక రోజున ఫారింగ్‌డన్ వీధిలో శాకాహారశాల (vegetarian restaurant) ఒకటి కనబడింది. తనకు కావలసిన వస్తువు దొరికినప్పుడు పిల్లవాడికి ఎంత ఆనందం కలుగుతుందో నాకు అంత ఆనందం కలిగింది. లోపలికి అడుగు పెట్టే పూర్వం ద్వారం దగ్గర గాజు కిటికీలో అమ్మకానికి పెట్టిన పుస్తకం ఒకటి కనబడింది. అది సాల్ట్ రచించిన “అన్నాహారసమర్థన” అను పుస్తకం. ఒక షిల్లింగు ఇచ్చి ఆ పుస్తకం కొన్నాను. తరువాత భోజనానికి కూర్చున్నాను. ఇంగ్లాండు వచ్చాక ఇవాళ కడుపు నిండా మొదటిసారి హాయిగా భోజనం చేశాను. దేవుడు నా ఆకలి తీర్చాడు.

సాల్ట్ రచించిన ఆ పుస్తకం చదివామ. నా మీద ఆ పుస్తక ప్రభావం బాగా పడింది. ఆ పుస్తకం చదివిన తరువాత అన్నాహారం మంచిదనే నిర్ణయానికి వచ్చాను.