పుట:సత్యశోధన.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

39


గదిలోనే వుండి నేను వెంట తెచ్చుకున్న చిరుతిండ్లు, పండ్లు తింటూ ఉన్నాను. మజుందారుగారికి ఇట్టి బాధలేదు. ఆయన అందరితోను కలిసి స్టీమరు పైభాగాన తిరుగుతూ వుండేవారు. కాని నేను పగలంతా నా గదిలోనే వుండి సాయంత్రం జనం తక్కువగా వున్నప్పుడు ఓడ పైకి వెళ్ళి తిరుగుతూ వుండేవాణ్ణి. మజుందారు నీవు కూడా ప్రయాణీకులందరితో కలసిమెలసి వుండమనీ, సిగ్గుపడవద్దనీ చెబుతూ వుండేవాడు. లాయర్లు బాగా మాట్లాడుతూ వుండాలని కూడా చెప్పి తన అనుభవాలు వినిపిస్తూ వుండేవాడు. అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ వుండమనీ, తప్పులు వచ్చినా భయపడవద్దని కూడా చెప్పేవాడు. కాని నాకు మాత్రం ధైర్యం చాలలేదు.

ఒక ఆంగ్లేయుడు దయతో నన్ను మాటల్లోకి దింపాడు. అతడు నాకంటే పెద్దవాడు. నీవు ఏమి తిన్నాపు? నీకేం పని? నీవెక్కడికి వెళుతున్నావు? నీకీ మొగమాటం ఎందుకు? ఈ రకమైన ప్రశ్నలు వేశాడు. అందరితోబాటు భోజనానికి రమ్మని ప్రోత్సహించాడు. మాంసం ముట్టకూడదన్న నా దీక్షను గురించి విని నవ్వాడు. ఓడ ఎర్ర సముద్రంలో ప్రవేశించినప్పుడు స్నేహితుడిలా సలహా యిస్తూ “బిస్కే సముద్రం చేరేటంతపరకు నీవు చెప్పిన విధంగా శాకాహారం తీసుకోవచ్చు. కాని తరువాత నీ ఆహార నియమాన్ని మార్చుకోక తప్పదు. ఇంగ్లాండులో చలి అధికం. అందువల్ల మాంసం తినక తప్పదు అని చెప్పాడు.

“అక్కడ మాంసం తినకుండా కూడా జనం ఉండవచ్చని విన్నానే” అని అన్నాను. “అసంభవం, నాకు తెలిసినంతవరకు ఆ విధంగా వుండే వారెవ్వరూ లేరు. నేను మద్యం తాగుతున్నాను, నిన్ను తాగమని చెప్పానా? కాని మాంసం తినక తప్పదు. తినకపోతే అక్కడ బ్రతకడం కష్టం” అని అన్నాడు.

మీ ఉపదేశానికి ధన్యవాదాలు. నేను మా అమ్మగారి ఎదుట మాంసం ముట్టనని ప్రమాణం చేశాను. అందువల్ల ఏది ఏమైనా సరే నేను మాంసం తినను. ఒకవేళ కుదరకపోతే తిరిగి మాదేశానికి వచ్చేస్తాను. అదే మంచిదని నా అభిప్రాయం అని చెప్పాను.

ఓడ బిస్కే సముద్రంలో ప్రవేశించింది. కాని అక్కడ మద్య మాంసాల జోరు కనబడలేదు. నేను బయలుదేరేటప్పుడు నీవు మాంసం ముట్టలేదని తెలిసిన వారి దగ్గర సర్టిఫికేటు తీసుకోమని మిత్రులు నాకు చెప్పారు. ఆ విషయం నాకు జ్ఞాపకం వున్నది. నాకు ఒక సర్టిఫికేటు ఇమ్మని వారిని కోరాను. అతడు సంతోషంతో ఇచ్చాడు. నేను కొంతకాలం ఆ సర్టిఫికేటును జాగ్రత్తగా కాపాడాను కాని ఆ తరువాత మాంసం