పుట:సత్యశోధన.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

చివరికి సీమ చేరాను

మా బావగారికి తెలిపి పైకం అడిగాను. ఆయన “సేఠ్ ఆజ్ఞను గురించి చెప్పి నేను నీకు డబ్బు ఇవ్వను” అని అన్నాడు. అప్పుడు నేను మా కుటుంబమిత్రులు ఒకరి దగ్గరకు వెళ్ళి విషయం అంతా చెప్పి నా ప్రయాణానికి అవసరమైన సొమ్ము ఇచ్చి సాయం చేయమనీ, మా అన్నగారిదగ్గర ఆ పైకం తీసుకోవచ్చుననీ విన్నవించాను. ఆయన నా విన్నపం అంగీకరించడమే కాక నన్నెంతో ప్రోత్సహించారు. వారికి కృతజ్ఞతలు తెలిపి అవసరమైన డబ్బు తీసుకొని వెళ్ళి ఓడ టిక్కెట్టు కొన్నాను. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడి మిత్రులు అనుభవజ్ఞులు. నాకు అవసరమయ్యే దుస్తులు తయారు చేయించారు. ఆ దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. వాటిలో కొన్ని నాకు బాగున్నాయి. కొన్ని బాగాలేవు. ఇప్పుడు నేను ధరించేందుకు అంగీకరించిన నెక్‌టైని ఆనాడు అసహ్యించుకున్నాను. పొట్టి చొక్కా (జాకెట్) ధరిస్తుంటే సిగ్గు వేసింది అయితే ఇంగ్లాండు వెళ్ళాలనే ఉత్సాహం ముందు ఈ చిన్న వ్యవహారాలు నిలువలేదు. ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు అధికంగా సమకూర్చుకున్నాను. జునాగఢ్ వకీలు త్ర్యంబకరాయ్ మజుందార్‌గారు కేబిన్‌లోనే నా మిత్రులు నాకు ఒక బెర్తు తీసుకున్నారు. వారికి నన్ను పరిచయం చేశారు. ఆయన పెద్దవాడు, లోకానుభవం గలవాడు నాకు అంత లోకానుభవం లేదు. పద్దెనిమిదేండ్లవాణ్ణి. ఇతణ్ణి గూర్చి మీరేమీ భయపడవద్దని నన్ను సాగనంపడానికి వచ్చినవారందరికీ మజుందార్ చెప్పాడు. ఈ విధంగా 1888 సెప్టెంబరు 4వ తేదీనాడు బొంబొయినుండి ఓడలో ఇంగ్లాండుకు బయలుదేరాను.

13. చివరికి సీమ చేరాను

సముద్రయానం వల్ల అందరికీ సామాన్యంగా వచ్చే వాంతులు మొదలగు వ్యాధులు నాకు రాలేదు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఆరాటం పెరుగుతూ ఉంది. స్టుఅర్డు ఆనగా నౌకరుతో మాట్లాడటానికి కూడా నాకు సంకోచంగా ఉండేది. నాకు ఇంగ్లీషులో మాట్లాడే అలవాటు లేదు. రెండవ సెలూన్‌లో ఒక్క మజుందారు తప్ప తక్కిన వారంతా ఆంగ్లేయులే. వారితో నేను మాట్లాడలేను. వారు ఇంగ్లీషులో ఏమి మాట్లాడారో నాకు తెలిసేది కాదు. తెలిసినప్పుడు బదులు చెప్పలేకపోయేవాణ్ణి. సమాధానం చెప్పదలిస్తే ముందు ప్రతివాక్యం లోపల కూడబలుక్కోవలసి వచ్చేది. భోజన సమయంలో ముల్లు గరిటెలు వాడటం నాకు చేతకాదు. ఆహార పదార్థాలలో మాంసం కలవని వస్తువులేమిటి అని అడగడానికి ధైర్యం చాలేది కాదు. అందువల్ల భోజనశాలకు వెళ్ళి పదిమందితో కలిసి కూర్చొని నేనెప్పుడూ భోజనం చేయలేదు. నా