పుట:సత్యశోధన.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

37

“కులధర్మాన్ని బట్టి నీవు సీమకు వెళ్ళడం సరిగాదు. సముద్రయానం మనకు నిషిద్ధం. అక్కడ ధర్మపాలనం సాధ్యంకాదు” అని సేఠ్ అన్నాడు. “సీమకు వెళ్ళడం ఎంతమాత్రం ధర్మేతరం కాదు. నేను అక్కడికి విద్య కోసం వెళుతున్నాను. మీరు భయపడుతున్న వస్తువుల్ని తాకనని మా అమ్మ దగ్గర ప్రతిజ్ఞ చేశాను. అది నన్ను కాపాడుతుంది” అని సమాధానం చెప్పాను.

“నీవు అక్కడికి వెళితే ధర్మపాలన జరగదు. మీ తండ్రిగారికి నాకు ఎంతటి స్నేహమో నీకు తెలుసా? కావున నా మాటవిను. సీమ ప్రయాణం విరమించుకో” అని సేఠ్ చెప్పగా, “అయ్యా నాకు తెలుసును. మీరు నా తండ్రివంటి వారు. సీమకు వెళ్ళాలనే నా నిర్ణయం మార్చుకోను. మా తండ్రిగారికి మిత్రులు, విద్వాంసులు అగు బ్రాహ్మణులు సీమకు వెళ్ళమని ప్రోత్సహించారు. వారికి దోషం ఏమీ కనబడలేదు. మా అమ్మగారు, మా అన్నగారు కూడా అంగీకరించారు. అందువల్ల నేను వెళతాను” అని సమాధానం ఇచ్చాను.

“అయితే కుల పెద్దల ఆజ్ఞను మన్నించవా?”

నాకు వేరే మార్గం లేదు. కులం పెద్దలు ఈ విషయంలో కల్పించుకోకూడదని స్పష్టంగా చెప్పివేశాను. దానితో సేఠ్‌గారికి కోపం వచ్చింది. చివాట్లు పెట్టాడు. నేను నిబ్బరంగా కూర్చున్నాను.

“నేను ఇతణ్ణి కులం నుంచి వెలివేస్తున్నాను. ఇతనికి సహాయం చేసేవారికి ఇతణ్ణి సాగనంపేందుకు హార్బరు దగ్గరకు వెళ్ళేవారికి ఒక రూపాయి పావలా (సాలి గ్రామదానం) జరిమానా విధిస్తున్నాను.” అని సేఠ్ తన నిర్ణయం ప్రకటించాడు. నేను ఏమీ చలించలేదు. సేఠ్ దగ్గర సెలవు తీసుకొని తిరిగి వచ్చేశాను. మా అన్నగారికి ఈ విషయం తెలిస్తే వెళ్ళవద్దు తిరిగి వచ్చేయమంటారేమోనని భయపడ్డాను. కాని మా అన్నగారు ఆ విధంగా అనలేదు సరికదా, కులంవారు వెలివేసినా భయపడనవసరం లేదు, నీవు నిర్భయంగా సీమకు వెళ్ళు అని జాబు వ్రాశారు. అది నా అదృష్టం. ఇదంతా జరిగిన తరువాత నాకు తొందర ఎక్కువైంది. ఇలాంటి వారి వత్తిడివల్ల మా అన్నగారి మనస్సు మారుతుందేమోనన్న భయం నన్ను పట్టుకున్నది. ఇంతలో జునాగఢ్ వకీలు ఒకరు ఇంగ్లాండుకు బారిష్టరు పరీక్ష కోసం సెప్టెంబరు నాలుగోతేదీన వెళుతున్నారని తెలిసింది. నేను ఈ వార్తను మా అన్నగారి మిత్రులకు తెలియజేశాను. ఇట్టి అవకాశం పోగొట్టుకోకూడదని వారంతా భావించారు. సమయం తక్కువగా వున్నందున తంతి ద్వారా ఈ విషయం మా అన్నగారికి తెలియజేశాను. ఆయన అందుకు అంగీకరించాడు.