పుట:సత్యశోధన.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

మతంతో పరిచయం

వెళుతూవుండేవారు. మమ్మల్ని కూడా తమతో పాటు అక్కడికి తీసుకుని వెళుతూవుండేవారు. అప్పుడప్పుడు మమ్మల్ని పంపుతూ వుండేవారు. జైన ధర్మాచార్యులు తరచుగా మా తండ్రిగారి దగ్గరకు వస్తూవుండేవారు. వారు మా తండ్రిగారితో ధర్మాన్ని గురించి, తదితర విషయాల్ని గురించి చర్చిస్తూవుండేవారు. ఇంతేగాక మా తండ్రికి మహమ్మదీయులు, పారశీకులు చాలామంది మిత్రులు వుండేవారు. వారు తమ తమ మతాల్ని గురించి చెపుతూ వుండేవారు. మా తండ్రి వారి మాటలు శ్రద్ధతో వింటూ వుండేవారు. మా తండ్రిగారికి ‘నర్సు’ గా వున్నందువల్ల వాళ్ళ మాటలు వినే అవకాశం నాకు లభిస్తూ వుండేది. ఈ విధంగా వివిధ మతాలను గురించిన విషయాలు వింటూ ఉండడం వలన వాటన్నిటియెడ సమత్వభావం నాకు కలిగింది. అందుకు ఆ చర్చలు దోహదం చేశాయి.

ఇక క్రైస్తవ మతం మాత్రమే మిగిలింది. దాని యెడ నాకు అభిరుచి కలుగలేదు. పైగా అరుచి ఏర్పడింది. ఆ రోజుల్లో క్రైస్తవమత బోధకులు కొందరు మా హైస్కూలు దగ్గర ఒక మూల నిలబడి హిందువుల్ని వారి దేవుళ్ళను నిందిస్తూ ఉపన్యాసాలు చేస్తూ వుండేవారు. నేను ఆ నిందను సహించలేకపోయేవాణ్ణి. వాళ్ళను వినడానికి నేను ఒక పర్యాయం మాత్రమే అక్కడ నిలబడ్డాను. ఇక నిలబడి వినవలసిన అవసరం లేకుండాపోయింది. ఆ రోజుల్లోనే సుప్రసిద్ధుడగు ఒక హిందువు క్రైస్తవమతంలో కలిసిపోయాడనీ, అతడు గోమాంసం తినవలసివచ్చిందనీ, మద్యం సేవించవలసి వచ్చిందని, వేషం కూడా మార్చవలసి వచ్చిందనీ తరువాత హ్యాటు, బూటు, కోటు వగైరా పాశ్చాత్య దుస్తులు ధరించి తిరగవలసి వచ్చిందనీ ఊరూ వాడా మారుమ్రోగిపోయింది. ఈ విషయం విని నేను బాధపడ్డాను. గోమాంసభక్షణం, మద్య సేవనం, పాశ్చాత్య వేషధారణం ఇట్టి విధులు విధించు మతం మతమనిపించుకోదను భావం నాకు కలిగింది. క్రొత్తగా మతం పుచ్చుకున్న ఆ వ్యక్తి అప్పుడే హిందూమతాన్ని, హిందూ దేవుళ్ళను, ఆచారాలను, చివరకు హిందు దేశాన్ని సైతం విమర్శిస్తున్నాడని విన్నాను. ఇట్టి విషయాలన్నీ క్రైస్తవ మత మంటే నాకు అరుచి కలిగించాయి.

ఇతర మతాల యెడ సమభావం కలిగిందంటే నాకు దేవుని మీద పూర్తిగా శ్రద్ధ ఏర్పడిందని అనుకోకూడదు. యిదే సమయంలో మా తండ్రిగారి దగ్గరగల గ్రంథ సముదాయంలో మనుస్మృతి అను గ్రంధం కనబడింది. అందు లిఖించబడిన విషయాలు నాకు శ్రద్ధ కలిగించలేదు. కొద్ది నాస్తికత్వం కలిగించాయి. మా రెండో పినతండ్రి కుమారుని తెలివితేటల మీద నాకు విశ్వాసం కలిగింది. నా సందేహాల్ని