పుట:సత్యశోధన.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

25

అంతటి శాంతం ఓర్పు వాస్తవానికి మా తండ్రి స్వభావానికి విరుద్ధం. ఆయన కోప్పడతారనీ, దూషిస్తారనీ లేక తల బ్రద్దలు కొట్టుకుంటారనీ భావించాను. కాని ఆయన ప్రదర్శించిన శాంతితత్వం అద్భుతం. అందుకు కారణం దోషాన్ని అంగీకరించడమేనని నా విశ్వాసం. మళ్లీ యీ విధమైన దోషం చేయను అని శపథం చేశాను. దాని అర్థం గ్రహించగలవారి ముందు వుంచాను. ఆదే సరియైన ప్రాయశ్చిత్తమని నా అభిప్రాయం. నేను దోషం అంగీకరించి యిక చేయనని శపథం చేసినందువల్ల మా తండ్రి నన్ను విశ్వసించారు. వారికి నా మీద వాత్సల్యం ఇనుమడించిందని నాకు బోధపడింది.

9. పితృ నిర్యాణం - నా వల్ల జరిగిన మహాపరాధం

అప్పుడు నాకు పదహారో ఏడు. మా తండ్రిగారు రాచకురుపుతో బాధపడుతూ మంచం పట్టారని పాఠకులకు తెలుసు. మా అమ్మగారు, ఒక పాత నౌకరు, నేను మా తండ్రిగారికి ముఖ్య పరిచారకులం. నర్సుపని, అనగా కట్టు విప్పి తిరిగి కట్టు కట్టడం, మందులు ఇవ్వడం, అవసరమైనప్పుడు మందులు నూరడం, మందులు కలపడం మొదలగు పనులు నాకు అప్పగించారు. ప్రతి రాత్రి వారి కాళ్ళు పిసికి, వారు చాలు అన్నప్పుడు విరమించేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు వారు నిద్రించేంతవరకు కాళ్ళు పిసుకుతూ వుండేవాణ్ణి. ఈ విధంగా తండ్రికి సేవ చేయడం నాకు ఎంతో ఇష్టంగా వుండేది. ఈ విషయంలో నేను ఎప్పుడూ ఏమరచి వుండలేదని గుర్తు. నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు అవసరమైన సమయం మినహా, మిగతా సమయమంతా బడికి వెళ్ళిరావడం, తండ్రికి సేవ చేయడంలో గడుపుతూ వుండేవాణ్ణి. నాకు మా తండ్రి సెలవు యిచ్చినప్పుడు వారికి కొంచెం నయంగా వున్నప్పుడు మాత్రమే నేను సాయంత్రం వాహ్యాళికి వెళుతూ వుండేవాణ్ణి. ఆ ఏడే నా భార్యకు నెల తప్పింది. యిప్పుడు ఆ విషయం తలచుకుంటే సిగ్గువేస్తుంది. నేను విద్యార్థి దశలో వుండికూడా బ్రహ్మచర్యాన్ని పాటించలేదు. నాకు కలిగిన సిగ్గుకు అదొక కారణం. విద్యా వ్యాసంగం నా విధి. పైగా చిన్నప్పటి నుంచి శ్రవణుడంటే నాకు గురి. పితృసేవ అంటే నాకు ఆసక్తి. అయినా నా భోగవాంఛ వీటన్నింటినీ మించిపోయిందన్నమాట. నా సిగ్గుకు యిది రెండో కారణం. ప్రతిరోజు రాత్రిపూట నా చేతులు మా తండ్రి పాదాలు వత్తుతూ వున్నా నా మనస్సు మాత్రం పడకగది మీద కేంద్రీకరించి యుండేది. ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం, లోకజ్ఞానం మూడింటి దృష్ట్యా స్త్రీ సంగమం నిషేధించబడిన సమయంలో నా మనఃస్థితి యిలా వుండేది. వదిలి పెడితే చాలు వెళదామని తొందరగా వుండేది. అనుమతి లభించగానే మా తండ్రి గారికి నమస్కరించి తిన్నగా పడకగదికి వడివడిగా వెళ్ళేవాణ్ణి.