పుట:సత్యశోధన.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

23

కొన్ని మొక్కల కాడలకు (పేరు జ్ఞాపకం లేదు) సన్నని బెజ్జాలు వుంటాయనీ, వాటిని సిగరెట్ల మాదిరిగా కాల్చవచ్చనీ విన్నాము. దీనితో మాకు తృప్తి కలుగలేదు. మా పారతంత్ర్యాన్ని గురించి యోచించి చాలా దుఃఖించాము. పెద్దల అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నందుకు విచారించాము. చివరికి విసిగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నాము. అయితే ఆత్మహత్య ఎలా చేసుకోవడం? విషం ఎలా దొరుకుతుంది? ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నాము. వాటి కోసం వెతుక్కుంటూ అడవికి వెళ్ళి వాటిని తెచ్చాము. సాయంకాలం వాటిని తినాలని ముహూర్తం నిర్ణయించుకున్నాం. కేదారేశ్వరుని దేవాలయానికి వెళ్ళి, దీపం ప్రమిదలో నెయ్యి పోశాం. దైవదర్శనం చేసుకున్నాం. మారుమూల వున్న చోటుకోసం వెతికాం. అయితే వెంటనే ప్రాణం పోకపోతే? చస్తే ఏమి లాభం? ఏమి సాధించినట్లు? స్వాతంత్ర్యం లేకుండా బ్రతకకూడదా? ఈ రకమైన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. ధైర్యం తగ్గిపోసాగింది. అప్పటికి రెండు మూడు ఉమ్మెత్తగింజలు మ్రింగివేశాము. తరువాత సాహసించలేకపోయాము. మాయిద్దరికీ చావంటే భయం వేసింది. కుదుటపడేందుకు, ప్రాణాలు నిలుపుకునేందుకు రామమందిరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఆత్మహత్య చేసుకోవడం తేలిక వ్యవహారం కాదని అప్పుడు నాకు బోధపడింది. అప్పటినుండి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటానని అంటే నాకు వాళ్ళ మాటమీద విశ్వాసం కలుగకుండా పోయింది.

ఈ ఆత్మహత్యా సంకల్పం మాకు మరో విధంగా తోడ్పడింది. సిగరెట్టు పీకలకు ఒక సలాం చేసేందుకు, సిగరెట్ల కోసం నౌకర్ల డబ్బులు దొంగిలించకుండా వుండేందుకు ఎంతగానో సహకరించింది.

పెరిగి పెద్దవాడినైన తరువాత సిగరెట్లు తాగాలనే వాంఛ ఎన్నడూ నాకు కలుగలేదు. అది చాలా అనాగరికం, హానికరం, రోత వ్యవహారం అను నిశ్చయానికి వచ్చాను.

ప్రపంచంలో సిగరెట్ల కోసం యింత మోజెందుకో నాకు అర్థం కాదు. పొగ త్రాగేవాళ్ళతో రైలు ప్రయాణం నేను చేయలేను, నాకు ఊపిరాడదు.

అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏండ్ల వయస్సులో (అంతకంటే తక్కువ వుండవచ్చు) మొదట సిగరెట్లకోసం డబ్బులు దొంగిలించాను. తరుపోత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మాంసం భక్షించే మా అన్న చేతికి వుండే బంగారుమురుగు నుండి కొంచెం బంగారం దొంగిలించాము, మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు