పుట:సత్యశోధన.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

433

పరుపుల కోసం దూదిని ఏకుతూ వుండేవాడు. అతడు ఏకులు తయారు చేసి యిస్తానని అంగీకరించాడు. అయితే మజూరీ ఎక్కువ అడిగాడు. నేను అంగీకరించాను. యీ విధంగా తయారైన నూలుతో తయారైన హారాన్ని వైష్ణవులకు డబ్బు తీసుకుని దేవుడికి హారంగా వాడుటకు అమ్మాను. శివాజీ బొంబాయిలో చరఖా క్లాసులు ప్రారంభించాడు. యీ ప్రయోగాలకు డబ్బు బాగా ఖర్చు అయింది. శ్రద్ధాళువులగు దేశభక్తులు డబ్బు ఇచ్చారు. నేను ఖర్చు చేశాను. ఆ ఖర్చు వ్యర్ధం కాలేదని వినమ్రంగా మనవి చేస్తున్నాను. మేము చాలా నేర్చుకున్నాం. కొలతబద్ద మాకు దొరికింది. ఇక నేను ఖాదీమయం అయిపోవాలని తహతహలాడాను. నేను కట్టుకున్నబట్ట దేశపు మిల్లు నూలుతో తయారైంది. బీజాపూరులోను, ఆశ్రమంలోను తయారవుతున్న ఖద్దరు బట్ట బాగా లావుగా వుండి 30 అంగుళాలు పన్నా కలిగి ఉన్నది. ఒకనెల లోపల 45 అంగుళాల పన్నా గలిగిన ఖద్దరు ధోవతి తెచ్చి ఇవ్వకపోతే లావుపాటి ఖద్దరు తుండుగుడ్డ కట్టుకోక తప్పదని గంగాబెన్‌కు చెప్పాను. పాపం ఆమె కంగారు పడింది. సమయం తక్కువ. అయినా ఆమె అధైర్యపడలేదు. నెలరోజులలోపల ఏభైఅంగుళాల పన్నా గల రెండు ఖాదీ ధోవతులు తెచ్చి నా ఎదుట వుంచింది. నా దారిద్ర్యం తొలిగిపోయింది. ఈ లోపున లక్ష్మీదాస్‌భాయి, లాటీ అను గ్రామం నుండి రామ్‌జీభాయి మరియు ఆయన భార్యయగు గంగాబెన్ అను పేర్లు గల అంత్యజులను ఆశ్రమం తీసుకువచ్చాడు. వారిచేత పెద్ద పన్నా గల ఖద్దరు తయారు చేయించాడు. ఖద్దరు ప్రచారానికి ఈ భార్యాభర్తలు యిద్దరూ చేసిన సేవ అసామాన్యమైనది. వాళ్ళు గుజరాత్‌లోను, గుజరాత్ బయట చేతితో వడికిన నూలుతో బట్ట నేయడం చాలామందికి నేర్పారు. ఆమె చదువుకోలేదు. కాని మగ్గం ముందు కూర్చొని నేత పని ప్రారంభించినప్పటినుండి అందులీనమైపోయేది. ఎవ్వరితోను మాట్లాడటానికి యిష్టపడేదికాదు. 

41. ఒక సంభాషణ

స్వదేశీ పేరుతో ఉద్యమం ప్రసిద్ధికెక్కేసరికి మిల్లు యజమానులు నన్ను తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. భాయీ ఉమర్ సుభానీ ఒక తెలివిగల మిల్లు యజమాని. అందువల్ల అతడు తన తెలివి తేటలు నాకు బోధపరుస్తూ వుండేవాడు. ఇతరుల అభిప్రాయాలు కూడా నాకు తెలుపుతూ వుండేవాడు. అట్టివారిలో ఒక వ్యక్తి మాటల ప్రభావం సుభానీ మీద కూడా పడింది. నన్ను ఆయన దగ్గరకు తీసుకొని వెళతానని అన్నాడు. ఆయన సలహా ప్రకారం మేము ఆ వ్యక్తి దగ్గరకు