పుట:సత్యశోధన.pdf/454

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
431
 

వడికి చూపిస్తుందని చెప్పాడు. క్రొత్త పనులు నేర్చుకోవడంలో నిపుణుడైన ఒక ఆశ్రమవాసిని ఆమె దగ్గర వడకడం నేర్చుకొనేందుకే పంపాము. కాని ఆ కళ మా చేతికందలేదు.

రోజులు గడుస్తున్నాయి. నాకు తొందర ఎక్కువైంది. ఆశ్రమానికి వచ్చే ప్రతి మనిషినీ యీ విషయం గురించి అడగడం ప్రారంభించాను. అయితే వడుకు వ్యవహారమంతా స్త్రీ సొత్తేనని తేలింది. వడుకు తెలిసి ఏమూలనో పడియున్న స్త్రీలను స్త్రీలే పట్టుకోగలరని తేలింది. 1917లో గుజరాతీ సోదరుడు ఒకడు నన్ను భడోంచ్ శిక్షాపరిషత్తుకు తీసుకువెళ్ళాడు. అక్కడ మహాసాహసియగు మహిళ గంగాబాయి నాకు కనబడింది. ఆమెకు పెద్దగా చదువురాదు. కాని చదువుకున్న స్త్రీలకంటే మించిన తెలివి, ధైర్యం ఆమెకు వున్నాయి. ఆమె అస్పృశ్యతను కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించి పారవేసింది. ఆమె దగ్గర డబ్బుకూడా వున్నది. ఆమె అవసరాలు చాలా తక్కువ. శరీరం బాగా బలంగా కుదిమట్టంగా వున్నది. ఎక్కడికైనా సరే నిర్భయంగా వెళ్లి వస్తుంది. సంకోచించదు. గుర్రం స్వారీకి సిద్ధపడేది. ఈ సోదరితో గోధరా పరిషత్తులో నాకు పరిచయం ఏర్పడింది. నా బాధను ఆమెకు తెలిపాను. దమయంతి ఏవిధంగా నలుడి కోసం తెగతిరిగిందో ఆ విధంగా రాట్నం కోసం తిరిగి దాన్ని తెస్తానని ప్రతిజ్ఞచేసి ఆమె నా నెత్తిన గల బరువును దించినంత పనిచేసింది. 

40. రాట్నం దొరికింది

గుజరాత్ ప్రాంతంలో తెగతిరిగిన తరువాత గంగాబెన్‌కు గాయక్వాడ్‌కు చెందిన బీజాపూరులో రాట్నం దొరికింది. అక్కడ చాలా కుటుంబాల వారి దగ్గర రాట్నాలు వున్నాయి. కాని వాటిని వాళ్ల అటకమీద పెట్టి వేశారు. వాళ్ళు వడికిన నూలు ఎవరైనా తీసుకొని, వాళ్లకు ఏకులు ఇస్తే వాళ్ళు నూలు వడికేందుకు సిద్ధంగా వున్నారని గంగాబెన్ చెప్పింది. నాకు అమిత సంతోషం కలిగింది. అయితే దూదితో తయారు చేసిన ఏకులు పంపడం, కష్టమైపోయింది. కీ.శే. ఉమర్‌సుభానీతో మాట్లాడగా ఆయన తన మిల్లునుండి ఏకులు పంపుతానని మాట యిచ్చాడు. ఏకులు గంగాబెన్ దగ్గరకు పంపాను. దానితో వడుకునూలు బహువేగంగా తయారవడం చూచి నివ్వరబోయాను.

భాయి ఉమర్ సుభానీ ఉదార హృదయుడు కనుక ఉదార బుద్ధితో ఏకులు యిచ్చి సహకరించాడు. అయితే హద్దంటూ వుంటుంది కద! డబ్బు యిచ్చి ఆయన దగ్గర ఏకులు కొనడానికి సంకోచించాను. అంతేగాక మిల్లులో తయారైన ఏకులతో