పుట:సత్యశోధన.pdf/450

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
427
 

మాలవ్యాగారు గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయన నా చేతికి తన సలహా కాగితం అందించి అందు ఓట్లు తీసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడమని తీయని మాటలతో కోరారు. నాకు వారి సూచన వచ్చింది. మాలవ్యాగారి కండ్లు ఆశాకిరణం కోసం వెతుకుతూ తిరుగుతున్నాయి. “ఈ విషయం రెండు పక్షాలకు యిష్టమయ్యేలా వున్నది” అని అన్నాను. లోకమాన్యునికి నేను ఆ కాగితం అందచేశాను. “దాసుకు యిష్టమైతే నాకు అభ్యంతరం లేదు” అని ఆయన అన్నారు. దేశబంధు కరిగి పోయారు. ఆయన బిపిన్ చంద్రపాల్ వంక చూచారు. మాలవ్యా గారి హృదయంలో ఆశ చిగురించింది. దేశబంధు నోటినుండి ‘సరే’ అనుమాట యింకా పూర్తిగా వెలువడకుండానే మాలవ్యాగారు లేచి నిలబడి “సజ్జనులారా! రాజీ కుదిరిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను” అని ప్రకటించారు. సభాస్థలి అంతా కరతాళ ధ్వనులతో మార్మోగి పోయింది. జనం ముఖాన కనపడుతున్న గాంభీర్యరేఖలు తొలగిపోయాయి. అందరి ముఖాలు సంతోషంతో కళకళ లాడాయి. ఆ తీర్మానం ఏమిటో ఇక్కడ వివరించవలసిన అవసరం లేదు. ఆ తీర్మానం ఏవిధంగా జరిగిందో వివరించడమే నా యీ సత్య శోధన యొక్క లక్ష్యం. ఆ తీర్మానం వల్ల నా బాధ్యత పెరిగింది. 

38. కాంగ్రెస్‌లో చేరిక

కాంగ్రెసులో నేను పాల్గొనవలసి వచ్చింది. అయితే దీన్ని నేను కాంగ్రెస్‌లో చేరిక అని అనను. జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో నిష్ఠగా పాల్గొంటూవున్నాను. అది అంతవరకే సీమితం. చిన్న సైనికుని పనివంటిదే. అక్కడ నా పని అంతకంటే మించి నాకు అక్కడ భాగస్వామ్యం వుంటుందని భావించలేదు. అట్టి కోరిక కూడా నాకు లేదు. నా శక్తి కాంగ్రెసుకు అవసరమని అమృతసర్ కాంగ్రెస్‌లో అనుభవం మీద తేలింది. పంజాబులో పరిశీలనాకమెటీ యిచ్చిన రిపోర్టు చూచి లోక మాన్యులు, మాలవ్యాగారు, మోతీలాల్ గారు, దేశబంధు దాసుగారు మొదలుగు వారంతా ఎంతో సంతోషించారు. ఆ విషయం నాకు బోధపడింది. దానితో వారు తమ సమావేశాలకు, చర్చలకు నన్ను పిలవడం ప్రారంభించారు. విషయ నిర్ధారణ సభ నిర్ణయాలన్నీ యిట్టి సమావేశాల్లోనే జరుగుతున్నాయని గ్రహించాను. యీ సమావేశాలలో జరిగే చర్చల్లో ఆ నాయకుల విశ్వాసపాత్రులే పాల్గొంటూ వుండటం కూడా గమనించాను. కొంతమంది ఏదోవిధంగా సమావేశాల్లో జొరబడేవాళ్లు. వాళ్లను కూడా చూచాను. రాబోయే సంవత్సరం చేయవలసిన రెండు కార్యక్రమాలను గురించి నాకు ప్రమేయం ఉన్నది.