పుట:సత్యశోధన.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

426

అమృతసర్ కాంగ్రెస్

దీక్షతో చిత్తరంజన్‌దాస్ వున్నారు. లోకమాన్యులు తటస్థంగా వున్నారు. అయితే చిత్తరంజన్ ప్రవేశపెట్టే తీర్మానానికే మొగ్గు చూపాలను నిర్ణయానికి వారు వచ్చారు.

ఇటువంటి పండి పోయిన సర్వమాన్యులగు పాత నాయకులతో అభిప్రాయ భేదం రావడం సహించలేక పోయాను. నా అంతర్వాణి నా కర్తవ్యాన్ని స్పష్టంగా సూచించింది. కాంగ్రెస్ సమావేశాల నుండి పారిపోదామని ప్రయత్నించాను. పండిత మోతీలాల్ నెహ్రూగారికి, పండిత మాలవ్యాగారికి నా అభిప్రాయం చెప్పివేశాను. నేను హాజరుకాకపోతే పని సాఫీగా జరుగుతుందని, మహానాయకులను వ్యతిరేకించవలసిన స్థితి నుండి నాకు ముక్తి లభిస్తుందని కూడా చెప్పాను. నా అభిప్రాయం ఆ పెద్దలిద్దరికీ రుచించలేదు. లాలా హరకిషన్‌లాల్ చెవిలో ఈ మాటపడేసరికి “అలా జరగడానికి వీలులేదు. పంజాబీలకు బాధకలుగుతుంది” అని ఆయన అన్నారు. లోకమాన్యునితోను, దేశబంధుతోను మాట్లాడాను. మిష్టర్ జిన్నాను కలిసాను. ఏవిధంగానూ దారి దొరకలేదు. నా బాధను మాలవ్యాగారికి తెలిపి “రాజీపడే అవకాశం కనబడటం లేదు. నా తీర్మానం ప్రవేశపెడితే చివరికి ఓట్లు తీసుకోవలసి వస్తుంది. యిక్కడ ఓట్లు తీసుకునే పద్ధతి కూడా సరిగా వున్నట్లు నాకు తోచడంలేదు. మన మహాసభలో దర్శకులకు, ప్రతినిధులకు తేడా ఏమీ లేదు. యింత పెద్ద సభలో ఓట్లు తీసుకునే వ్యవస్థ మనకు లేదు. నా తీర్మానం మీద ఓట్లు తీసుకోమని కోరదామంటే అందుకు అవకాశమే లేదు” అని అన్నాను. అయితే లాలా హరకిషన్‌లాల్ అట్టి వ్యవస్థ చేయిస్తానని పూచీ పడ్డారు. ఓట్లు తీసుకునే రోజున దర్శకుల్ని రానివ్వం. ప్రతినిధుల్ని మాత్రమే రానిస్తాం. వారి ఓట్లు లెక్కింపచేసే బాధ్యత నాది. అందువల్ల మీరు కాంగ్రెస్‌కు హాజరు కాకపోవడం సరికాదు అని గట్టిగా అన్నారు.

చివరికి నేను తలవంచాను. నా తీర్మానాన్ని తయారు చేశాను. ఎంతో సంకోచిస్తూ నా తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టుటకు సిద్ధపడ్డాను. మిస్టర్ జిన్నా మరియు పండిత మాలవ్యాగారలు నా తీర్మానాన్ని సమర్ధిస్తామని చెప్పారు. ఉపన్యాసాలు పూర్తి అయ్యాయి. భావాలలో వ్యతిరేకత వున్నా కటుత్వానికి ఉపన్యాసాలలో చోటు లభించలేదు. ఉపన్యాసాలలో తర్కందప్ప మరేమీలేదు. అయినా మహాసభలో పాల్గొనే జనం నాయకుల అభిప్రాయభేదాల్ని సహించే స్థితిలో లేరు. సభలో అందరు ఏకాభిప్రాయాన్ని కోరుతూ వున్నారు. ఉపన్యాసాలు జరుగుతూ వున్నపుడు కూడా అభిప్రాయభేదం తొలగించేందుకు వేదిక మీద ప్రయత్నాలు సాగుతూ వున్నాయి. నాయకుల మధ్య చీటీల రాకపోకలు జరుగసాగాయి. ఏది ఏమైనా రాజీ కోసం