పుట:సత్యశోధన.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

425

వృత్తిని కాళ్లతోతన్నివేసి పంజాబులో తిష్ఠవేశారు. వారే అమృతసర్ ఉపన్యాసం యిచ్చి హిందీ భాషయొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పడం, విదేశాలలో వుంటున్న హిందూ దేశస్థుల సమస్యలను గురించి చెప్పడం వరకే నా పని సీమితం అయింది. అమృతసర్ కాంగ్రెసులో కూడా అంతకంటే మించి నేను చేయవలసింది ఏమీ వుండదని భావించాను. కాని అక్కడ ఎంతో బాధ్యత నా మీద పడింది. బ్రిటిష్ చక్రవర్తి తరఫున క్రొత్త సంస్కరణలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. నాకు అవి పూర్తి సంతృప్తిని కలిగించలేదు. యితరులకైతే అసలు తృప్తికరంగా లేవు. అయినా వాటిని ఆ సమయంలో అంగీకరించటమే మంచిదను నిర్ణయానికి నేను వచ్చాను. చక్రవర్తి ప్రకటనలో లార్డ్ సింహ్ చెయ్యి వుందని నాకు అనిపించింది. వారిభాషలో నాకు ఆశారేఖ గోచరించింది. కాని అనుభవజ్ఞులగు లోకమాన్యులు చిత్తరంజనదాసు మొదలగు యోధులు అంగీకరించలేదు. మాలవ్యా వంటి వారు తటస్థంగా వున్నారు.

మాలవ్యాగారింట్లో నా మకాం ఏర్పాటు చేశారు. కాశీ విశ్వవిద్యాలయం శంకుస్థాపన రోజున మాలవ్యాగారి నిరాడంబరత్వాన్ని చూచే అవకాశం నాకు లభించింది. కాని ఈ పర్యాయం వారు నన్ను తన గదిలోనే వుండమన్నారు. అందువల్ల వారి దినచర్యను కండ్లారా చూచే అవకాశం దొరికింది. నాకు ఆనందమేగాక ఆశ్చర్యం కూడా కలిగింది. వారున్న గది బీదలుండే ధర్మశాల అని చెప్పవచ్చు. అక్కడ కొద్దిగా కూడా ఖాళీగా వదిలిన చోటులేదు. అంతటా జనం వున్నారు. ఖాళీ చోటుగాని, ఏకాంత ప్రదేశంగాని అక్కడ లేదు. ఎవరైనా ఎప్పుడైనా సరే రావచ్చు. వారితో మాట్లాడవచ్చు. ఆ గదియందలి ఒక కొసన నా దర్బారు. అంటే నా మంచం వున్నది. అయితే మాలవ్యాగారి నడవడికను గురించి చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. గనుక అసలు విషయానికి వస్తాను. మాలవ్యాగారితో రోజూ మాట్లాడడానికి అవకాశం లభించింది. తన అభిప్రాయాలను పెద్దన్నగారు తమ్ముడికి చెప్పే పద్ధతిన నాకు ప్రేమతో చెబుతూ వుండేవారు. ప్రభుత్వ సంస్కరణలకు సంబంధించిన సభలో పాల్గొనడం అవసరమని భావించాను. పంజాబ్ కాంగ్రెస్ యొక్క రిపోర్టును గురించిన వ్యవహారంలో నాకూ పాలు వున్నది. పంజాబు విషయంలో ప్రభుత్వం చేత పని చేయించుకోవాలి. ఖిలాఫత్ సమస్య సరేసరి. మాంటెగ్యూ హిందూ దేశాన్ని మోసం చేయరను నమ్మకం నాకు వున్నది. ఖైదీలు ముఖ్యంగా అలీ సోదరుల విడుదల శుభ లక్షణమని భావించాను. అందువల్ల సంస్కరణలను అంగీకరిస్తూ తీర్మానం చేయాలని అభిప్రాయపడ్డాను. సంస్కరణలు అసంతృప్తికరంగా వున్నాయి. గనుక వాటిని తిరస్కరించాలనే దృఢ