పుట:సత్యశోధన.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

422

ఖిలాఫత్‌కు బదులు గోసంరక్షణా?

సహకరించాలి. అయితే దానితో గోసంరక్షణను జోడించకూడదు. హిందువులు అలా కోరడం మంచిదికాదు. ఖిలాఫత్ కోసం ముస్లిములు గోవధను ఆపుతామంటే అది సరికాదు. ఒకే గడ్డ మీద ఇరుగుపొరుగున ఉండటంవల్ల గోసంరక్షణకు ముస్లింలు పూనుకొంటే అది వారికి గౌరవం. ఈ విధంగా యోచించాలని నా భావం. ఈ సభలో ఖిలాఫత్‌ను గురించే చర్చించాలని నా అభిప్రాయమని స్పష్టంగా ప్రకటించాను. సమావేశంలో అంతా అందుకు అంగీకరించారు. గోసంరక్షణను గురించి సమావేశంలో చర్చ జరుగలేదు. అయితే మౌలానా అబ్దుల్ బారీ సాహబ్ “ఖిలాఫత్‌కు హిందువులు సహకరించినా, సహకరించకపోయినా మహమ్మదీయులు గోసంరక్షణకు పూనుకోవాలి అని అన్నాడు. ముస్లింలు గోవధను నిజంగా ఆపివేస్తారని అని అనిపించింది. కొందరు పంజాబు సమస్యను ఖిలాఫత్‌తోబాటు చర్చించాలని అన్నారు. నేను వ్యతిరేకించాను. పంజాబుది స్థానిక సమస్య. పంజాబులో జరిగిన దారుణాలవల్ల బ్రిటిషు సామ్రాజ్యానికి సంబంధించిన ఉత్సవాలకు దూరంగా ఉందాము. ఖిలాఫత్‌తో బాటు పంజాబును కలిపితే మన తెలివితక్కువను వేలెత్తి చూపే అవకాశం వున్నదని చెప్పాను. అంతా నా వాదాన్ని అంగీకరించారు. యీ సభలో మౌలానా హసరత్ మొహానీ కూడా వున్నారు. వారితో నాకు పరిచయం కలిగింది. కాని ఆయన ఎలాంటి యోధుడో నాకు ఇక్కడే తెలిసింది. మాకు అభిప్రాయభేదం ప్రారంభమైంది. ఆ అభిప్రాయ భేదం ఇంకా అనేక విషయాలలో కూడా ఏర్పడింది. హిందూ మహమ్మదీయులు స్వదేశీవ్రతం పాలించాలని అందుకోసం విదేశీవస్త్రాలను బహిష్కరించాలని చర్చ జరిగింది. అప్పటికి ఇంకా ఖద్దరు యొక్క జననం కాలేదు. ఈ విషయం మౌలానా హసరత్ సాహబ్‌కు గొంతు దిగలేదు. ఖిలాఫత్ విషయంలో బ్రిటీష్ ప్రభుత్వం సహకరించకపోతే పగతీర్చుకోవాలని ఆయన తపన. అందుకై బ్రిటిషువారి వస్తువులను సాధ్యమైనంతవరకు బహిష్కరించాలని ఆయన భావం. నేను బ్రిటిషు వారి వస్తువులను వెంటనే బహిష్కరించటం ఎంత అసాధ్యమో వివరించాను. నా అభిప్రాయాల ప్రభావం సభాసదులమీద బాగా పడటం నేను గమనించాను. అయితే మౌలానా హసరత్ సాహబ్ విపరీతంగా తర్కిస్తూవుంటే ఒకటే చప్పట్లు మోగాయి. దానితో నా పని హుళక్కేనని అనుకున్నాను. తరువాత ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా నా కర్తవ్యం నేను నిర్వహించడం అవసరమని భావించి మాట్లాడేందుకు లేచాను. నా ఉపన్యాసం శ్రద్ధగా జనం విన్నారు. నా భావాలకు బాగా సమర్దన లభించింది. తరువాత నన్ను సమర్థిస్తూ చాలామంది మాట్లాడారు. బ్రిటిషు వారి వస్తువులను బహిష్కరిస్తే లాభం లేదని ఎగతాళి తప్ప ప్రయోజనం కలగదని జనం గ్రహించారు. మొత్తం సభలో వున్న జనం