పుట:సత్యశోధన.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

420

పంజాబులో

సరళాదేవి చౌదరాణి మీద నా ఆతిధ్యపు భారం పడింది. భారమని ఎందుకు అంటున్నానంటే ఆనాటికి కూడా నేను ఏ ఇంటి యజమాని దగ్గర బసచేస్తానో ఆ ఇల్లు ధర్మసత్రంగా మారిపోతూవుంది. పంజాబులో చాలామంది నాయకుల్ని జైళ్లలో నిర్భదించి వుంచారు. అందువలన వాళ్ల చోటును మాలవ్యాగారు, మోతీలాల్ గారు, స్వామీ శ్రద్ధానందగారు అధిష్టించారు. మాలవ్యాగారితోను, శ్రద్ధానందగారితోను నాకు అదివరకే పరిచయం వున్నది. కాని మోతీలాలు గారితో దగ్గరి పరిచయం లాహోరులోనే నాకు కలిగింది. ఈ నాయకులతో బాటు జైళ్లలో పెట్టబడని పలువురు స్థానిక నాయకులు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆత్మీయంగా చూచారు. మేమంతా ఏకగ్రీవంగా హంటర్ కమిటీ ఎదుట సాక్ష్యాలుగాని, వాఙ్మూలాలు గాని యివ్వకూడదని నిర్ణయానికి వచ్చాం. అందుకు గల కారణాలు అప్పుడే సవివరంగా ప్రకటించాం. వాటినన్నిటిని యిక్కడ తిరిగి ఏకరువు పెట్టను. కాని మేము చెప్పిన కారణాలు బలవరత్తరమైనవని ఆ కమిటీని బహిష్కరించడం సబబైన పనేనని యీ నాటికి నా నిశ్చితాభిప్రాయం. అయితే హంటర్ కమిటీని బహిష్కరించి వూరుకోకూడదని, ప్రజల పక్షాన అనగా కాంగ్రెస్ పక్షాన ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయం చేశాం. పండిత మాలవ్యాగారు నన్ను, పండిత మోతిలాల్ నెహ్రూ, కీ.శే చిత్తరంజన్ దాస్, అబ్బాస్ తయాబ్జీ, జయకర్‌గారలను ఒక కమిటీగా నియమించారు. మేము పరిశీలన కోసం విడివిడిగా పర్యటన ప్రారంభించాం. యీ కమిటీ భారం ఎక్కువగా నా మీద పడింది. అత్యధిక గ్రామాలను దర్శించే పని నాకు అప్పగించడంవల్ల పంజాబు నందలి గ్రామాల్ని స్వయంగా చూచే అవకాశం నాకు కలిగింది. యీ పర్యటన సందర్భంలో పంజాబు నందలి మహిళలతో నేను బాగా కలిసిపోయాను. యుగయుగాల నుండి వారిని నేను ఎరిగి వున్నంతగా సామీప్యం ఏర్పడింది. వెళ్లిన ప్రతిచోట స్త్రీలు అత్యధికంగా వచ్చి తాము వడకిన నూలు చిలపలు తెచ్చి, నా ఎదుట పోగులు పోయసాగారు. ఈ యాత్రా సందర్భంలో పంజాబు ఖద్దరుకు గొప్ప కేంద్రం కాగలుగుతుందనే విశ్వాసం నాకు కలిగింది. అక్కడ జరిగిన ఘోరాలు అపరిమితం. లోతుకు వెళ్లిన కొద్దీ అధికారుల అరాచకత్వం, దుర్మార్గం, నియంతృత్వం విని, చూచి నివ్వెరబోయాను. ప్రభుత్వ సైన్యంలో ఎక్కువగా వున్నది పంజాబీలే. అట్టివారి మీద యిన్ని ఘోరాలు ఎలా చేయగలిగారు, వాళ్లు ఎలా సహించారా అని యోచించి విస్తుపోయాను.

మా కమిటీ రిపోర్టు తయారుచేసే బాధ్యత నా మీద పడింది. పంజాబ్‌లో జరిగిన దురంతాలను గురించి తెలుసుకోదలచిన వారు మా రిపోర్టు చదవమని