పుట:సత్యశోధన.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

21

 కలిగినట్లనిపించింది. సిగ్గుపడిపోయాను. భూమి తనలో నన్ను ఇముడ్చుకోకూడదా అని అనిపించింది. అయితే ఆ ఆపద నుండి నన్ను రక్షించినందుకు భగవంతుణ్ణి ప్రార్ధిస్తూవున్నాను. నా జీవితంలో ఇటువంటి ఘట్టాలు నాలుగు పర్యాయాలు జరిగాయి. అదృష్టం వల్ల వాటి నుండి బయటపడ్డాను. నా ప్రయత్నం కంటే నా అదృష్టమే తోడ్పడిందని చెప్పవచ్చు. యివన్నీ తప్పుడు పనులే. నా పతనానికి కారణం విషయవాంఛలే. ఈ వ్యవహారంలో అవే ఎక్కువగా పనిచేశాయి. నేను వాటికి లొంగిపోయాను. నిజానికి క్రియ ఎట్టిదో, అందుకు తోడ్పడే భావం కూడా అట్టిదే. కాని లౌకిక దృష్టితో చూస్తే నేను నిర్దోషిని. దేవుని అనుగ్రహం వల్ల కర్తకు, అతనికి సంబంధించిన వారికి తప్పిపోయే కర్మలు కొన్ని వుంటాయి. ఆ విధంగా ఆపద తప్పిపోయిన తరువాత జ్ఞానం కలిగిన వెంటనే దేవుని అనుగ్రహాన్ని గురించి మానవుడు యోచిస్తాడు. మనిషి వికారాలకు లోనవడం అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా భగవంతుడు అడ్డుపడి ఆ వికారాల్ని తొలగించి మనిషిని రక్షిస్తూ వుండటం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఎలా జరుగుతున్నది? మానవుడు ఎంతవరకు స్వతంత్రుడు? ఎంతవరకు పరతంత్రుడు? పురుష ప్రయత్నం ఎంతవరకు పనిచేస్తుంది? భగవదేచ్ఛ ఎప్పుడు రంగంలో ప్రవేశిస్తుంది? యిది పెద్ద వ్యవహారం.

ఇక విషయానికి వద్దాం. యింత జరిగినా నా స్నేహితుని దుస్సాంగత్యాన్ని గురించి నా కండ్లు మూసుకొనే వున్నాయి. ఊహించి యెరుగని అతని దోషాలు ప్రత్యక్షంగా యింకా నేను చూడలేదు. అతని దోషాల్ని కండ్లారా చూచినప్పుడు కాని నా కండ్లు తెరుపుడుపడలేదు. అప్పటివరకు ఆ దోషాలు అతనిలో లేవనే భావించాను. వాటిని గురించి తరువాత వివరిస్తాను.

అప్పటి మరో విషయం వ్రాయడం అవసరమని భావిస్తున్నాను. మా దంపతుల మధ్య ఏర్పడిన విభేదాలకు జరిగిన కలహాలకు కారణం కూడా అతడి స్నేహమే. మొదటే వ్రాశాను నేను నా భార్య యెడ మిక్కిలి ప్రేమ కలవాణ్ణని. దానితోపాటు ఆమె యెడల నాకు అనుమానం కూడా ఏర్పడింది. యిందుకు కారణం ఆ స్నేహమే. మిత్రుడు చెప్పిన మాటల్ని నిజాలని పూర్తిగా నమ్మాను. మిత్రుని మాటలు నమ్మి నా భార్యను కష్టాలపాలు చేశాను. నేను ఆమెను హింస పెట్టాను. అందుకు నన్ను నేను క్షమించుకోలేను. యిలాంటి కష్టాలు హిందూస్త్రీయే సహిస్తుంది. అందువల్లనే స్త్రీని నేను ఓర్పుకు, సహనశక్తికి ప్రతీక అని భావిస్తాను. నౌకరును అపోహతో అనుమానిస్తే అతడు ఉద్యోగం మానుకొని వెళ్ళిపోతాడు. కన్నకొడుకుని అవమానిస్తే ఇల్లు వదలి