పుట:సత్యశోధన.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

416

నవజీవన్ మరియు యంగ్ ఇండియా

వాళ్లకు సహకార నిరాకరణోద్యమం అంటే ఏమిటో బోధించాలి. అప్పుడే యీ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈ విధంగా యోచించి నేను బొంబాయి చేరుకొని సత్యాగ్రహ సంస్థ ద్వారా సత్యాగ్రహుల వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేసి, సత్యాగ్రహ విధానాల్ని వారికి బోధపరిచి, అందుకు అవసరమైన కరపత్రాలు ప్రకటించే ఏర్పాటు చేశాను. ఈ పని ప్రారంభించానే గాని జనాన్ని ఆకర్షించలేకపోయాను. వాలంటీర్లు అధికంగా దొరకలేదు. చేరినవారైనా పూర్తిగా గ్రహించారా అంటే సమాధానం చెప్పడం కష్టమే. రోజులు గడిచిన కొద్దీ వాళ్లు కూడా జారుకోవడం ప్రారంభించారు. దానితో సహకార నిరాకరణోద్యమం బండి నేను అనుకొన్నట్లు వేగంగా నడవడం లేదని, నెమ్మదిగా నడుస్తున్నదని గ్రహించాను. 

34. నవజీవన్ మరియు యంగ్ ఇండియా

ఒకవైపున సహాయనిరాకరణోద్యమం (దాని నడక ఎంత సన్నగిల్లినా) నడుస్తూనే వున్నది. మరోవైపున ప్రభుత్వ పక్షాన ఆ ఉద్యమ అణచివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. పంజాబులో ఈ దృశ్యం కనబడింది. అక్కడ మిలటరీ చట్టం అంటే నియంతృత్వం ప్రారంభమైంది. నాయకుల్ని నిర్భందించారు. ప్రత్యేకించిన న్యాయస్థానాలు, న్యాయస్థానాలుగా వుండక, గవర్నరు ఆర్డరును పాలించే సాధనాలుగా మారిపోయాయి. విచారణ అనేదే లేకుండా అందరికీ శిక్షలు విధించారు. నిరపరాధుల్ని పురుగుల్లా బోర్లా పడుకోబెట్టి పాకించారు. యీ దుర్మార్గం ముందు జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన ఘోరకృత్యం కూడా తలవంచుకుంది. అయితే బాగ్‌లో జరిగింది నరమేధం గనుక ప్రపంచాన్ని అది బాగా ఆకర్షించింది.

ఏ విధంగానైనా సరే మీరు పంజాబు వెళ్లాలి అని నా మీద వత్తిడి ఎక్కువైంది. నేను వైస్రాయికి జాబు వ్రాశాను. తంతి పంపాను. కాని అనుమతి లభించలేదు. అనుమతి లేకుండా వెళితే లోనికి అడుగు పెట్టనీయరు కదా! చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించాననే గౌరవం తప్ప వేరే ప్రయోజనం చేకూరదు. ధర్మసంకటంలో పడ్డాను. ప్రభుత్వం వారి నిషేధాజ్ఞను ఉల్లంఘించితే అది సహకార నిరాకరణోద్యమం క్రిందకు రాదు. శాంతిని గురించి ఆశించిన విశ్వాసం యింకా నాకు కలుగలేదు. పంజాబులో జరుగుతున్న దుర్మార్గపు పాలన వల్ల దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. యిట్టి స్థితిలో నేను చట్టాన్ని ఉల్లంఘించితే అగ్నిలో ఆజ్యం పోసినట్లవుతుందని అనిపించింది. అందువల్ల పంజాబులో ప్రవేశించడానికి నేను ఇష్టపడలేదు. ఇది చేదు నిర్ణయం.