పుట:సత్యశోధన.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

414

పర్వతమంత తప్పు

యిచ్చాను. నా కర్తవ్యం ఏమిటో స్పష్టంగా బోధపడింది. ఏ కార్మికుల మధ్య అధిక సమయం గడిపానో, ఏ కార్మికులకు నేను సేవ చేశానో, ఏ కార్మికులు సత్కార్యాలు చేస్తారని నేను ఆశించానో ఆ కార్మికులే కొట్లాటలలో పాల్గొనడం సహించలేకపోయాను. వారు చేసిన అపరాధంలో నేను కూడా భాగస్వామినేనని భావించాను.

ప్రభుత్వానికి లొంగిపొమ్మని జనానికి సలహా యిచ్చినట్లే జనం చేసిన తప్పుల్ని క్షమించమని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాను. కాని నా మాట యిరుపక్షాల వారిలో ఒక్క పక్షం వారు కూడా వినలేదు. ప్రజలు తమ తప్పును అంగీకరించలేదు. ప్రభుత్వం వారిని క్షమించేందుకు సిద్ధపడలేదు. కీ. శే రమణభాయి మొదలుగాగల పౌరులు వచ్చి సత్యాగ్రహం ఆపివేయమని నన్ను కోరారు. ఆ విధంగా నన్ను కోరవలసిన అవసరమే లేదు. శాంతిని గురించి తెలుసుకొని జనం ఆ విధంగా నడుచుకోనంత వరకు సత్యాగ్రహ సమరాన్ని నిలిపివేయాలని నేను అప్పటికే నిర్ణయానికి వచ్చివున్నాను. అందుకు వాళ్లంతా సంతోషించారు. కొంతమంది మిత్రులకు కోపం కూడా వచ్చింది. దేశమందంతట శాంతంగా సంగ్రామం సాగాలని అనుకుంటే అది సాధ్యం కాదని వారు భావించారు. నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఏ ప్రజలకు నేను సేవ చేశానో ఆ ప్రజలు కూడా సత్యాగ్రహ సమరాన్ని గురించి, శాంతిని గురించి సరిగా గ్రహించకపోతే యి సత్యాగ్రహ పోరాటం జరపడం సాధ్యం కాదని చెప్పివేశాను. సత్యాగ్రహులు తమ హద్దు వుండి శాంతియుతంగా పోరాటం సాగించాలని అది నా నిశ్చితాభిప్రాయమని చెప్పాను. యీ నాటికీ నా అభిప్రాయం అదే. 

33. పర్వతమంత తప్పు

అహమదాబాదు సభ ముగించుకొని నేను నడియాద్ వెళ్లాను. పర్వతమంత తప్పు అని నేను అక్కడ అన్నమాట ఎంతో ప్రచారంలోకి వచ్చింది. అట్టి మాట అదివరకు నేను ఎప్పుడూ అనలేదు. అహమదాబాదులోనే నా తప్పు నాకు స్పష్టంగా కనబడింది. నడియాద్ వెళ్ళి అక్కడి పరిస్థితిని గురించి యోచించాను. ఖేడా జిల్లాకు చెందిన చాలామందిని అరెస్టు చేశారని విన్నాను. అక్కడి సభలో ప్రసంగిస్తూ ఖేడా జిల్లావాసులను, తదితరుల్ని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని చట్టాల్ని ధిక్కరించమని నేను కోరాను. ఆ కోరికలో తొందరపాటు కలదని నా మనస్సుకు తోచి పైమాట అనేశాను. ఆ తప్పు పర్వతమంతగా నాకు కనిపించింది. ఆ విషయం బహిరంగంగా ప్రకటించేసరికి నన్ను చాలామంది ఎగతాళి చేసారు. అయినా తప్పును