పుట:సత్యశోధన.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

411

అతడు నన్ను రేవాశంకర్ ఝుబేరీగారి ఇంటి దగ్గర దింపివెళ్లాడు. “మిమ్మల్ని అరెస్టు చేశారని తెలిసి జనంకోపంతో పేట్రేగిపోయారు. వాళ్లకు పిచ్చి ఎక్కినంత పని అయింది. పాయధునీ దగ్గర కొట్లాట జరిగేలా వుంది. మేజిస్ట్రేటు, పోలీసులు అక్కడికి హుటాహుటిన వెళ్లారు” అని నాకు చెప్పాడు. నేను ఇంటికి చేరానో లేదో యింతలో ఉమర్ సుభానీ, అనసూయాబెన్ కారులో వచ్చి నన్ను పాయుధునీకి బయలుదేరమని అన్నారు. “ప్రజలు కోపంతో వున్నారు. వాతావరణం ఉద్రిక్తంగా వుంది. జనం ఎవ్వరు చెప్పినా వినే స్థితిలో లేరు. మిమ్మల్ని చూస్తే శాంతించవచ్చు” అని అన్నారు. నేను కారులో కూర్చున్నాను. పాయధునీ చేరాను. అక్కడ అంతా గందరగోళంగా వున్నది. నన్ను చూడగానే జనం సంతోషంతో ఊగిపోయారు. జనం పెద్ద ఊరేగింపు తీశారు. వందేమాతరం, అల్లా హో అక్బర్ అను నినాదాలతో ఆకాశం మార్మోగింది. పాయధునీ దగ్గర పోలీసులు గుర్రాల మీద ఎక్కి కనబడ్డారు. ఇటుక రాళ్ల వర్షం కురుస్తూ వున్నది. శాంతంగా వుండమని చేతులు జోడించి జనాన్ని ప్రార్థించాను. ఇటుకలు, రాళ్లు మాకు తప్పవని అనిపించింది.

ఊరేగింపు అబ్దుల్ రహమాన్ వీధి నుండి క్రాఫర్జ్ మార్కెట్టు వైపుకు మళ్లింది. ఇంతలో ఎదురూగా గుర్రపు రౌతుల పటాలం వచ్చి నిలబడింది. ఫోర్టువైపు వెళ్లకుండా ఊరేగింపును ఆపేందుకు రౌతులు ప్రయత్నించసాగారు. క్రిక్కిరిసి వున్న జనం ఆగుతారా? పోలీసు లైనును దాటి జనం ముందుకు దూసుకు వెళ్ళారు. నా మాటలు ఎవ్వరికీ వినబడలేదు. వెంటనే గుర్రపు రౌతుల దళాధికారి జనాన్ని చెదరగొట్టమని ఆర్డరు యిచ్చాడు. తళతళలాడే బల్లాలను త్రిప్పుతూ గుర్రపు రౌతులు హఠాత్తుగా జనం మీదకి గుర్రాల్ని తోలారు. నా ప్రక్కగా బల్లాలు బహువేగంగా తళ తళ మెరుస్తూ ముందుకు సాగుతూ వున్నాయి. జనం చెదిరిపోయారు. అక్కడ గుర్రాలు పరిగెత్తేందుకైనా చోటు లేదు. ఎటు పోదామన్నా త్రోవలేదు. దృశ్యం కడు భయానకంగా వుంది. అటు గుర్రపు రౌతులు, ఇటు జనం. యిద్దరికీ పిచ్చి ఎక్కినట్లున్నది. గుర్రాలకు ఏమీ కనబడటం లేదు. ఎటుబడితే అటు, ఎలా బడితే అలా దౌడు తీస్తున్నాయి. వేలాది జనాన్ని చెల్లాచెదురు చేయాలి. గుర్రపు రౌతులకు ఏమీ కనబడటం లేదని బోధపడుతూవుంది. మొత్తం మీద జనాన్ని చెల్లాచెదురు చేసి వాళ్లను ముందుకు సాగకుండా చేశారు. మా కారును మాత్రం ముందుకు పోనిచ్చారు. పోలీసు కమీషనరు ఆఫీసు ముందు కారు ఆపించాను. పోలీసులు వ్యవహరించిన తీరుపై అసమ్మతి తెలుపుదామని కారు దిగాను.