పుట:సత్యశోధన.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

410

ఆ వారం - 1

దిగడానికి నేను అంగీకరించలేదు. “అశాంతి పెంచేందుకు గాక అశాంతిని తగ్గించేందుకై వెళ్లదలిచాను. అందువల్ల యీ ఆదేశాన్ని పాటించలేనని తెలుపుటకు విచారిస్తున్నాను” అని చెప్పివేశాను. పల్వల్‌స్టేషను వచ్చింది. మహాదేవ్ నాతోబాటు వున్నాడు. ఢిల్లీ వెళ్లి శ్రద్ధానంద గారికి యీ విషయంచెప్పి, జనాన్ని శాంతంగా వుండేలా చూడమని మహాదేవ్‌కి చెప్పాను. గవర్నమెంటు ఆర్డరును పాటించకుండా అరెస్టు కావడమే మంచిదని భావించానని, నన్ను అరెస్టు చేశాక కూడా ప్రజలు శాంతంగా వున్నారంటే అది మనకు విజయమని భావించాలని కూడా చెప్పమన్నాను.

పల్వల్ స్టేషనులో దింపివేసి పోలీసులు నన్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ నుండి వస్తున్న ఏదో రైల్లో మూడోతరగతి పెట్టె ఎక్కించారు. పోలీసుల బృందం నా వెంట వున్నది. మధుర చేరిన తరువాత నన్ను పోలీసుల బారెక్‌కు తీసుకువెళ్లారు. నన్ను ఎక్కడికి తీసుకువెళతారో ఏ అధికారి చెప్పలేకపోయాడు. ప్రాతఃకాలం నాలుగు గంటలకు నన్ను మేల్కొలిపి బొంబాయికి వెళ్లే ఒక గూడ్సు బండిలో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం బండి సవాయి మాదోపూర్ చేరింది. అక్కడ నన్ను దింపివేశారు. బొంబాయి వెళ్లే బండిలో ఎక్కించారు. లాహోర్ నుండి వచ్చిన ఇన్స్‌పెక్టర్ బోరింగ్ అక్కడ నా బాధ్యత వహించాడు. ఫస్ట్‌క్లాస్ పెట్టెలో నన్ను కూర్చోబెట్టారు. నా వెంట బోరింగ్ దొర కూర్చున్నాడు. యిక నేను జెంటిల్‌మెన్ ఖైదీగా మారిపోయానన్నమాట. సర్ మైకాల్ ఓడయరును గురించి తెల్లదొర వచ్చి ప్రారంభించాడు. మాకు మీరంటే వ్యతిరేకత లేదు, కాని పంజాబులో మీరు అడుగు పెడితే అక్కడ అశాంతి ప్రబలుతుంది గనుక అక్కడికి వెళ్లవద్దని, తిరిగి వెళ్లిపొమ్మని నాకు చెప్పాడు. “నేను ఆ విధంగా వెళ్లనని, మీ ఆదేశాన్ని పాటించనని” చెప్పాను. అయితే చట్టరీత్యా చర్య తీసుకుంటామని అన్నాడు. ఏం చేయదలచుకున్నారో చెప్పమని దొరను అడిగాను. నాకేమీ తెలియదని, మిమ్మల్నిబొంబాయి తీసుకు వెళుతున్నానని, మరో ఆదేశం కోసం ఎదురుచూస్తున్నానని అతడు అన్నాడు.

సూరత్ చేరాం. మరో అధికారి వచ్చాడు. నా బాధ్యతను తాను స్వీకరించాడు. బండి బయలుదేరింది. మిమ్మల్ని విడుదల చేశారు. మీ కోసం మెరీన్‌లైన్సు స్టేషనులో బండి ఆపిస్తాను. మీరు ఇక్కడ దిగిపోతే మంచిది. కొలాబా స్టేషనులో జనం విపరీతంగా వుంటారని భావిస్తున్నాను అని అన్నాడు. మీరు చెప్పిన ప్రకారం చేయడం నాకు సంతోషదాయకం అని అన్నాను. అతడు ఆనందించి ధన్యవాదాలు తెలిపాడు. నేను మెరీన్‌లైన్సులో బండి దిగిపోయాను. ఎవరో పరిచితుడి గుర్రం బండి కనబడింది.