పుట:సత్యశోధన.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

409

రూపాయల నోట్లు కూడా యిచ్చారు. ఒక ప్రతికి 50 రూపాయలు ఒకరు యిచ్చినట్లు నాకు గుర్తు. యీ పుస్తకాలు కొన్న వారికి కూడా జైలు శిక్ష పడవచ్చునని ముందుగానే జనానికి చెప్పాం. కాని ఆ క్షణంలో జైలు భయం జనానికి పోయిందని చెప్పవచ్చు. అయితే ఏ పుస్తకాల్ని ముద్రించి మేము అమ్మకం చేశామో వాటికి నిషేధం లేదని ప్రభుత్వం భావించిందని ఏడవ తేదీన తెలిసింది. అమ్మకం జరిగిన పుస్తకాలు పునర్ముద్రణ పొందినట్టివి. నిషేధం ప్రథమ ముద్రణ వరకే నీమితం. కనుక పుస్తకాల అమ్మకం చట్టవిరుద్ధం కాదని ప్రభుత్వం భావించిందట. యీ వార్త తెలిసినప్పుడు జనం కొద్దిగా నిరుత్సాహపడ్డారు.

ఏడవ తేదీన స్వదేశీ వ్రతం పట్టేందుకు హిందూ ముస్లిం సమైక్యత కోసం ప్రతిజ్ఞ చేసేందుకు చౌపాటీ దగ్గర సభ జరగాల్సి వున్నది. తెల్లగా కనబడేవన్నీ పాలు కాజాలవని తెలిసింది. అక్కడికి బహు కొద్దిమంది మాత్రమే వచ్చారు. వారిలో ఇద్దరు ముగ్గురు మహిళల పేర్లు నాకు గుర్తు వున్నాయి. పురుషులు కూడా బహు కొద్దిమందే వచ్చారు. నేను వ్రతాన్ని గురించిన ముసాయిదా తయారుచేసి వుంచాను. సభలో పాల్గొన్న వారందరికి వివరించి చెప్పి వ్రతాన్ని గురించిన శపథం చేయించాను. కొద్దిమంది మాత్రమే హాజరవడం వల్ల నాకు ఆశ్చర్యంగాని, విచారంగాని కలగలేదు. తుఫానుల వంటి కార్యాలకు, నిర్మాణాత్మక కార్యాలకు గల తేడా నాకు తెలుసు. తుఫాను కార్యాలంటే సహజంగా జనానికి పక్షపాతం వుంటుంది. నెమ్మదిగా సాగే నిర్మాణ కార్యక్రమాలంటే అభిరుచి వుండదు. దీన్ని గురించి వ్రాయాలంటే మరో ప్రకరణం అవసరం.

9వ తేదీ రాత్రి ఢిల్లీ అమృత్‌సర్‌లకు బయలుదేరాను. ఎనిమిదవ తేదీన మధుర చేరాను. నన్ను అరెస్టు చేయవచ్చునను వార్త నా చెవినపడింది. మధుర తరువాత ఒక స్టేషను దగ్గర రైలు ఆగుతుంది. అక్కడ ఆచార్య గిద్వానీ వచ్చి కలిశారు. నన్ను అరెస్టు చేయబోతున్నారని ఆయన నన్ముకంగా చెప్పాడు. నా సేవలు అవసరమైతే చెప్పండి, సిద్ధంగా వున్నానని అన్నాడు. ధన్యవాదాలు చెప్పి అవసరమైతే మీ సేవల్ని ఉపయోగించుకుంటానని చెప్పాను.

రైలు పల్వల్ స్టేషనుకు చేరక పూర్వమే ఒక పోలీసు అధికారి నా చేతిలో ఒక ఆర్డరు పత్రం వుంచాడు. “మీరు పంజాబులో ప్రవేశిస్తే అశాంతి ప్రబలే ప్రమాదం వున్నది గనుక మీరు పంజాబు గడ్డమీద అడుగు పెట్టవద్దు.” అని ఆ పత్రంలో వున్నది. ఆ ఆర్డరు పత్రం యిచ్చి ఈ బండి దిగిపొమ్మని ఆ పోలీసు అధికారి ఆదేశించాడు. బండి