పుట:సత్యశోధన.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

407

యుద్ధం. అది ధార్మిక యుద్ధం, ధర్మకార్యం. శుద్ధిగా ప్రారంభించాలి. అందువల్ల ఆ రోజున ఉపవాసం చేయాలి. పనులేవీ చేయకూడదు. ముస్లిం సోదరులు రోజూ ఉపవాసం చేస్తారు గనుక 24 గంటలపాటు అంతా ఉపవాసం చేయాలి. అన్ని ప్రాంతాలవారు చేరుతారో లేదో తెలియదు. కనుక ముందుగా బొంబాయి, మద్రాసు, బీహారు, సింధ్‌లో జరపాలి. యీ ప్రాంతాల్లో సరిగా హర్తాళ్ జరిగితే దానితో తృప్తిపడాలి’ యిదీ స్వప్నంలో నాకు వినబడిన సలహా.

ఈ సలహా రాజగోపాలచార్యులకు బాగా నచ్చింది. తరువాత యితర మిత్రులకు తెలియజేశాం. అందరూ హర్షం ప్రకటించారు. ఒక చిన్న నోటీసు తయారుచేశాను. ప్రారంభంలో ది. 30 మార్చి 1919 నాడు హర్తాళ్ జరపాలని నిర్ణయించారు. తరువాత అది ఏప్రిల్ 6వ తేదీకి మారింది. ప్రజలకు కొద్దిరోజుల ముందే యీ సమాచారం అందజేయబడింది. పని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించాము. వ్యవధి ఎక్కువగా లేదు.

ఆశ్చర్యం! ఎలా జరిగాయో ఏమో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి. హిందూ దేశమంతట పట్టణాల్లో, పల్లెటూళ్లలో జయప్రదంగా హర్తాళ్ జరిగింది. అద్భుతమైన దృశ్యం అది. 

31. ఆ వారం -1

దక్షిణాదిన కొద్దిగా పర్యటించి ఏప్రిల్ 4వ తేదీ నాటికి బొంబాయి చేరాను. శంకర్‌లాల్ బాంకరు ఏప్రిల్ 6వతేదీ నాడు హర్తాళ్ జరిపేందుకై బొంబాయిరమ్మని తంతి పంపాడు. మార్చి 30వతేదీన ఢిల్లీలో హర్తాళ్ జరిగింది. కీ.శే. శ్రద్ధానందగారు, డా. హకీమ్ అజమల్ ఖాన్ సాహెబ్ అందుకు పూనుకున్నారు. ఏప్రిల్ 6వ తేదీన హర్తాళ్ జరపాలనే వార్త ఢిల్లీకి ఆలస్యంగా చేరింది. ఢిల్లీలో 30వ తేదీన జరిగిన హర్తాళ్ ఎంతో బాగా జరిగింది. హిందువులు, మహమ్మదీయులు కలిసి హృదయపూర్తిగా చేసిన హర్తాళ్ అది. ముస్లిములు శ్రద్ధానంద్ గారిని జామా మసీదుకు ఆహ్వానించడమే కాక అక్కడ వారిచే ఉపన్యాసం కూడా చేయించారు. ప్రభుత్వాధికారులు యీ వ్యవహారాన్ని సహించలేకపోయారు. రైలు స్టేషను వైపు ఊరేగింపుగా వెళుతున్న జనాన్ని పోలీసులు ఆపి వారిని తుపాకీ గుండ్లకు గురిచేశారు. కొంతమంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అధికార్లు అణచివేత చర్యకు పూనుకున్నారు. శ్రద్ధానందగారు నన్ను వెంటనే డిల్లీ రమ్మని తంతి పంపారు. ఏప్రిల్ 6వ తేదీన బొంబాయిలో వుండి వెంటనే ఢిల్లీ వస్తానని శ్రద్ధానందగారికి తంతి ద్వారా తెలియజేశాను