పుట:సత్యశోధన.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

401

జల చికిత్స ప్రారంభించినందున నా శరీరం యింకా నిలిచివున్నది. బాధ తగ్గింది. కాని శరీరం కుదుటబడలేదు. వైద్యులు, డాక్టర్లు ఎన్నో సలహాలు యిచ్చారు కాని నేను అంగీకరించలేదు. పాలు తీసుకోకపోతే మాంసం పులుసు పుచ్చుకోమని, ఆయుర్వేద శాస్త్రంలో అందుకు అంగీకరించారని కొందరు వైద్యులు గ్రంథాలు తిరగవేసి మరీ చెప్పారు. ఒకరు గుడ్డు తీసుకోమని చెప్పారు. ఎవ్వరి మాటా నేను వినలేదు. ఆహారం విషయంలో గ్రంథాల మీద నేను ఎన్నడూ ఆధారపడలేదు. ఆహారంలో ప్రయోగాలు నా జీవితంలో భాగమై పోయాయి. ఏదో ఒకటి తినడం, ఏదో మందు పుచ్చుకోవడం నేనెరుగను. నా బిడ్డలకు, భార్యకు, మిత్రులకు వర్తించని ధర్మం నాకు మాత్రం ఎలా వర్తిస్తుంది? ఇది జీవితంలో నాకు చేసిన పెద్దజబ్బు, ఎక్కువకాలం మంచం పట్టిన జబ్బు కూడా యిదే. జబ్బు తీవ్రతను దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు చిక్కింది. ఒకనాటి రాత్రి యిక బ్రతకనని అనిపించింది. మృత్యువుకు దగ్గరలో వున్నానని అనిపించింది. శ్రీమతి అనసూయాబెన్‌కు కబురు పంపాను. ఆమె వచ్చింది. వల్లభభాయి వచ్చారు. డాక్టర్ కానూగా వచ్చారు. డాక్టర్ కానూగా కూడా నాడిని జాగ్రత్తగా పరిశీలించి చూచి “మృత్యు లక్షణాలేమీ నాకు కనబడటం లేదు. నాడి శుభ్రంగా వున్నది. బలహీనత వల్ల మీరు మానసికంగా భయపడుతున్నారు” అని చెప్పారు. కాని నా మనస్సు అంగీకరించలేదు. ఆ రాత్రి అతికష్టం మీద గడిచింది. కన్ను మూతబడలేదు.

తెల్లవారింది. నేను చనిపోలేదు. అయినా బ్రతుకు మీద ఆశ నాకు కలుగలేదు. మరణం దగ్గరలో వున్నదని భావించి గీతాపఠనం విడువకుండా సాగించమని చెప్పి, గీతాశ్లోకాలు వింటూ పడుకున్నాను. పనిచేసే శక్తి లేదు. చదివే ఓపిక అసలే లేదు. రెండు మూడు వాక్యాలు మాట్లాడేసరికి మెదడు అలిసిపోతున్నది. అందువల్ల ప్రాణం మీద ఆశపోయింది. బ్రతకడం కోసం బ్రతకడం నాకు యిష్టం లేదు. కాయకష్టం చేయకుండా అనుచరుల చేత చేయించుకుంటూ బ్రతకడం భారమనిపించింది. ఈవిధమైన స్థితిలో వుండగా డాక్టర్ తల్‌వల్కర్ ఒక విచిచిత్రమై వ్యక్తిని తీసుకువచ్చారు. ఆయన మహారాష్ట్రకు చెందినవాడు. భారతదేశంలో ఆయనకు ఖ్యాతి లేదు. ఆయనను చూడగానే నా మాదిరిగానే ఆయన కూడా పెంకిరకమని గ్రహించాను. ఆయన తన చికిత్సను నా మీద ప్రయోగించి చూచేందుకు వచ్చాడని తేల్చుకున్నాను. ఆయన గ్రేట్ మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్రం అధ్యయనం చేశాడు. అయితే డిగ్రీ తీసుకోలేదు. బ్రహ్మ సమాజంలో చేరాడని తరువాత తెలిసంది. ఆయన పేరు కేల్కర్. పూర్తిగా