పుట:సత్యశోధన.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

400

మృత్యుశయ్య మీద

నడిచినంత శ్రమ కలిగింది. అతికష్టం మీద అక్కడికి చేరాను. మెలికలు తిరిగేటంతగా వుంది కడుపునొప్పి. పావుగంటకు ఒకసారి చొప్పున విరోచనాలు ప్రారంభమైనాయి. భరించలేక నేను పడుతున్న బాధను గురించి చెప్పివేశాను. మంచం ఎక్కాను. అక్కడి పాయిఖానా దొడ్డిని ఉపయోగించాను. కాని అంత దూరం కూడా వెళ్లలేక పక్క గదిలో కమోడ్ పెట్టమని చెప్పాను. సిగ్గుపడ్డాను కాని గత్యంతరం లేదు. పూల్ చంద్ బాపూజీ పరుగెత్తుకొని వెళ్లి కమోడ్ తెచ్చాడు. చింతాక్రాంతులైన నలుగురూ చుట్టూ మూగారు. అంతా ప్రేమామృతం నామీద కురిపించారు కాని నా బాధను పంచుకోలేరు గదా! నా మొండిపట్టు కూడా యిబ్బందికరంగా వున్నది. డాక్టర్లను పిలుస్తామంటే వద్దని వారించాను. మందు తీసుకోను. చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తాను అని చెప్పివేశాను. అనుచరులు ఓర్పు వహించారు. 24 గంటల్లో 30 లేక 40 సార్లు విరోచనాలు అయ్యాయి. ఆహారం పూర్తిగా మానివేశాను. తిందామనే వాంఛ పోయింది. రాతి వంటి శరీరం నాది అనుకునేవాణ్ణి. కాని బలం తగ్గిపోయింది. డాక్టర్లు వచ్చి మందు తీసుకోమని చెప్పారు. నేను తీసుకోనని చెప్పివేశాను. ఇంజక్షను గురించి అప్పటి అజ్ఞానాన్ని తలచుకుంటే నవ్వువస్తుంది. ఇంజక్షను గొట్టంలో ఒక విధమైన చెడు ఔషధం వుంటుందని అనుకునేవాణ్ణి. నా అభిప్రాయం సరికాదని తరువాత తెలిసింది. అయితే అప్పటికి సమయం దాటిపోయింది. జిగట విరోచనాలు తగ్గలేదు. మాటిమాటికి లేవవలసిన పరిస్థితి ఏర్పడింది. దానితో జ్వరం వచ్చింది. ఒళ్లు తెలియకుండా పడిపోయాను. మిత్రులు భయపడిపోయారు. చాలామంది డాక్టర్లు వచ్చారు. కాని రోగి అంగీకరించకపోతే వారేం చేస్తారు?

సేఠ్ అంబాలాలు, ఆయన సతీమణి నడియాద్ వచ్చారు. అనుచరులతో మాట్లాడి నన్ను మీర్జాపూరులో వున్న తమ బంగళాకు కడు జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. జబ్బుస్థితిలో నేను పొందిన నిర్మల, నిష్కామసేవ మరెవ్వరూ పొందియుండరని చెప్పగలను. జ్వరం తక్కువగా వున్నా శరీరం క్షీణించిపోయింది. జబ్బు చాలాకాలం లాగుతుందని మంచం మీద నుండి లేవలేనని అనుకున్నాను. అంబాలాలు గారి బంగళాలో ప్రేమామృతం వారు ఎంత కురిపిస్తున్నా నేను అక్కడ వుండలేకపోయాను. ఆశ్రమం చేర్చమని వారిని వేడుకున్నాను. నా పట్టుదలను చూచి వారు నన్ను ఆశ్రమం చేర్చారు. బాధపడుతున్న సమయంలో వల్లభభాయి వచ్చి యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని, సైన్యంలో యువకుల్ని చేర్చవలసిన అవసరం లేదని కమీషనరు చెప్పాడని అన్నారు. సంతోషం కలిగింది. బరువు తీరినట్లనిపించింది.