పుట:సత్యశోధన.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

399

మనవి చేస్తున్నాను. ఇంగ్లీషు వారిలో గల విశ్వసనీయతను ప్రతి భారతీయుని హృదయంలో నెలకొల్పాలని కాంక్షిస్తున్నాను. 

28. మృత్యుశయ్య మీద

సైన్యంలో యువకుల్ని చేర్చడం కోసం నా శరీరం అరిగిపోయింది. అప్పుడు వేయించి దంచిన బెల్లం కలిపిన వేరుసెనగపప్పు నా ఆహారం. అరిటిపండ్లు, రెండు మూడు నిమ్మకాయల రసం, వేరుసెనగ పప్పు ఎక్కువగా తింటే హానిచేస్తుందని తెలుసు. అయినా దాన్ని ఎక్కువగా తిన్నాను. అందువల్ల విరోచనాలు పట్టుకున్నాయి. నేను తరచు ఆశ్రమం వెళ్లవలసి వస్తూ వుండేది. విరోచనాలు అంత బాధాకరమని అనిపించలేదు. రాత్రి ఆశ్రమం చేరాను. అప్పుడు మందులేమీ వాడేవాణ్ణి కాను. ఒక పూట ఆహారం మానివేస్తే విరోచనాలు తగ్గిపోతాయని భావించాను. మరునాడు ఉదయం ఏమీ తినలేదు. దానితో బాధ కొంత తగ్గింది. యింకా ఉపవాసం చేయడం అవసరమని, ఆహారం తీసుకోవలసి వస్తే పండ్లరసం వంటి వస్తువేదైనా తీసుకోవాలని నాకు తెలుసు.

అది ఏదో పండగరోజు. మధ్యాహ్నం ఏమీ తిననని కస్తూరిబాయికి చెప్పినట్లు గుర్తు. కాని ఆమె పండగపూట కొంచెం తినమని ప్రోత్సహించింది. నేను కొంచెం ఉబలాటపడ్డాను. నేను పశువుల పాలు పుచ్చుకోవడం లేదు. అందువల్ల నెయ్యి, మజ్జిగ కూడ మానివేశాను. కస్తూరిబాయి నూనెతో వేయించిన గోధుమజావ, పెసరపప్పు పదార్థం నాకిష్టమైనవి చేసివుంచింది. వాటిని చూచేసరికి నాకు నోరు ఊరింది. కస్తూరిబాయికి తృప్తి కలిగించేందుకు కొద్దిగా తిందామని, రుచి చూడటంతోపాటు శరీర రక్షణ కూడా సాధ్యపడుతుందని భావించాను. కాని సైతాను రెడీగా పొంచివున్నాడు. తినడం ప్రారంభించిన తరువాత పూర్తిగా తినివేశాను. తినడానికి పసందుగా వున్నాయేగాని, యమధర్మరాజును చేతులారా కొని తెచ్చుకున్నానని తరువాత తేలింది. తిని ఒక గంట అయిందో లేదో కడుపులో నొప్పి ప్రారంభమైంది.

రాత్రికి నడియాద్ వెళ్లాలి. సాబర్మతి స్టేషను వరకు నడిచి వెళ్లాను. మైలున్నర దూరం నడవాలంటే కష్టమైపోయింది. అహమదాబాదు స్టేషనులో వల్లభభాయి కలిశారు. ఆయన నేను పడుతున్న బాధను గ్రహించారు. అయినా బాధ భరించలేకపోతున్నానని ఆయనకుగాని, యితర అనుచరులకుగాని నేను చెప్పలేదు. నడియాద్ చేరాం. అక్కడికి అనాధాశ్రమం అరమైలు దూరాన వుంది. పదిమైళ్ల దూరం