పుట:సత్యశోధన.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

398

సైన్యం కోసం యువకుల ఎంపిక

లేదు. మా సాయం భవిష్యత్తు మీద గల ఆశల పునాది మీద ఆధారపడియున్నది. ఆ ఆశలు స్పష్టంగా చెప్పడం అవసరమని భావిస్తున్నాను. నేను బేరసారాలకు దిగను. కానీ ఈ విషయమై మా హృదయాలలో నిరాశ నెలకొంటే మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యం మీద మాకు గల నమ్మకం అంతా నీరుగారిపోతుంది. గృహకల్లోలాలు మరిచిపొమ్మని అన్నారు. దానికి అర్థం అధికారుల ఆకృత్యాలను మరిచిపొమ్మనా? అలా అనుకుంటే అది సాధ్యం కాని పని. సుసంఘటితంగా సాగే దుర్మార్గాన్ని పూర్తి శక్తి సామర్ధ్యాలతో ఎదుర్కోవడం ధర్మమని నా భావం. అందువల్ల అధికారులకు దుర్మార్గాలు ఆపివేయమని, ప్రజాభిప్రాయాన్ని ఆదరించమని చెప్పండి. చంపారన్‌లో శతాబ్దాల తరబడి సాగుతున్న దుర్మార్గాన్ని ఎదుర్కొని బ్రిటిష్ వారి న్యాయవ్యవస్థ ఎంత గొప్పదో నిరూపించి చూపించాను. సత్యం కోసం కష్టాల్ని సహించగల శక్తి తమకు వున్నదని తెలుసుకున్న ఖేడా ప్రజలు వాస్తవానికి ప్రభుత్వ శక్తి ఒక శక్తి కాదని, ప్రజా శక్తియే నిజమైన శక్తియని గ్రహించారు. ఆ తరువాత అక్కడి ప్రజలు అప్పటివరకు తాము శపిస్తున్న ప్రభుత్వం శక్తి యెడ తమకు గల వ్యతిరేకతను తగ్గించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని సహించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయదని విశ్వసించారు. అందువల్ల చంపారన్, ఖేడాలలో నేను జరిపిన చర్యలన్నీ యుద్ధానికి సహాయపడాయని భావిస్తున్నాను. యిటువంటి చర్యలు చేయవద్దని మీరు నన్ను కోరితే శ్వాస పీల్చవద్దని మీరు చెబుతున్నారని భావిస్తాను. ఆయుధ బలం కంటే ఆత్మ బలం, అనగా ప్రేమ బలం గొప్పదను భావం ప్రజల హృదయాలలో నేను నాటగలిగితే భారతదేశం మొత్తం ప్రపంచానికే తలమానికం కాగలదని భావిస్తున్నాను. అందువల్ల ప్రతివ్యక్తీ కష్టాలు దుఃఖాలు సహించగల శక్తిని అలవరచుకునే పద్ధతిన సనాతన విధానాన్ని జీవితంలో అనుసరించడం కోసం నా ఆత్మశక్తిని వినియోగిస్తాను. ఈ విధానాన్ని అనుసరించమని యితరులను కూడా ఆహ్వానిస్తూ వుంటాను. యితర వ్యవహారాలలో తలదూర్చడం యీ విధానం యొక్క గొప్పదనాన్ని రుజూచేసేందుకేనని మనవి చేస్తున్నాను.

ముస్లిం రాజ్యాల విషయమై గట్టిగా మాట యిమ్మని బ్రిటిష్ మంత్రి వర్గానికి మీరు వ్రాయండి. ప్రతి మహమ్మదీయుడు యీ విషయమై చింతిస్తున్నాడని మీరు గ్రహించండి. నేను హిందువును అయినా వారి భావాన్ని విస్మరించలేదు. వాళ్ల దుఃఖం మా దుఃఖమే. ముస్లిం రాజ్యాల హక్కుల రక్షణ కోసం, వారి ధార్మిక స్థలాల విషయంలో, వారి భావాల్ని ఆదరించే విషయంలో భారతదేశానికి హోమ్‌రూలు మొదలగు వాటిని అంగీకరించడం బ్రిటిష్ సామ్రాజ్యానికే క్షేమం కలిగిస్తుందని