పుట:సత్యశోధన.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

19

వంతులు కావాలి. అప్పుడు తెల్లవాళ్ళను జయించి హిందూ దేశాన్ని స్వతంత్ర్యం చేయవచ్చు. ఇదే నా కోరిక. స్వరాజ్యం అను శబ్దం అప్పటికి నా చెవిన పడలేదు. కాని స్వతంత్ర్యం అంటే ఏమిటో నాకు తెలుసు. సంస్కారపు పిచ్చి నన్ను అంధుణ్ణి చేసింది. రహస్యంగా మాంసభక్షణం చేసి, తల్లిదండ్రులకు యీ విషయం తెలియనీయకుండా రహస్యంగా వుంచాలి. యిలా చేయడం సత్యపథాన్నుండి తొలగడం కాదనే నమ్మకం నాకు కలిగింది.

7. దుఃఖకరమైన ప్రకరణం - 2

నిర్ణయించిన రోజు రానే వచ్చింది. ఆనాటి నా స్థితిని గురించి వర్ణించలేను. ఒకవైపు సంస్కరణాభిలాష. మరోవైపు జీవితంలో గొప్ప మార్పు వస్తుందనే భావం. యింకోవైపు దొంగలా చాటుగా యీ పని చేస్తున్నాననే బిడియం, బాధ. వీటిలో ప్రాధాన్యం దేనిదో చెప్పలేను. ఏకాంత ప్రదేశం దొరికింది. అక్కడ జీవితంలో మొదటిసారి మాంసం చూచాను. నాన్‌రొట్టె కూడా తెచ్చాం. రెండిటిలో ఒక్కటి కూడా రుచించలేదు. మాంసం తోలులా బిరుసుగా వుంది. మింగడం సాధ్యం కాలేదు. కక్కు వచ్చినంత పని అయింది. మాంసం పరిత్యజించవలసి వచ్చింది.

ఆ రాత్రి కష్టమైపోయింది. ఏవేవో పీడకలలు రాసాగాయి. కన్నుమూతబడేసరికి నా కడుపులో బ్రతికియున్న మేక ‘మే మే’ అని అరిచినట్లనిపించడం, త్రుళ్ళిపడి లేవడం, ఇష్టపడే మాంసం తిన్నాను గదా అని ఊరట చెందడం, యిదీ వరస.

నా మిత్రుడు అంతటితో నన్ను వదలలేదు. మాంసంతో రకరకాల పాకాలు వండి తేవడం ప్రారంభించాడు. నదీతీరాన తినడం మాని గొప్ప భవనంలో తినడం ప్రారంభించాము. భోజనశాలలో మేజా బల్లలు. కుర్చీలు, అన్నీ వున్నాయి. అక్కడి వంటవాణ్ణి మంచి చేసుకుని మిత్రుడు ఆ దివ్య భవనంలో స్థానం సంపాదించాడు.

మిత్రుని ప్లాను బాగా పనిచేసింది. నాన్‌రొట్టెమీద నాకు రోత పోయింది. మేకల మీద జాలి గూడా తగ్గిపోయింది. వట్టి మాంసం కాకుండ, మాంసంతో తయారుచేసిన రకరకాల పాకాలు తినసాగాను. యీ విధంగా ఒక సంవత్సరం గడిచింది. మొత్తం ఆరు మాంసపు విందులు ఆరగించాను. తక్కువసార్లు తినడానికి కారణం ఆ రాజభవనం మాటిమాటికీ దొరక్కపోవడమే. రుచిగల మాంసపు వంటకాలు మాటిమాటికీ సిద్ధం చేయడం కూడా కష్టమే. పైగా యీ సంస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన సొమ్ము నా దగ్గర లేదు. మిత్రుడే డబ్బు తెచ్చి ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఎక్కడనుండి అంత డబ్బు తెచ్చేవాడో తెలియదు. నన్ను మాంసాహారిగా మార్చాలని,