పుట:సత్యశోధన.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

395

జాబులో పేర్కొన్నాను. జాబును ప్రకటించేందుకు అనుమతించమని వైస్రాయిని కోరాను. ఆయన సంతోషంతో అనుమతించారు. ఆ జాబు సిమ్లా పంపాల్సి వచ్చింది. సమావేశం ముగియగానే వైస్రాయి సిమ్లా వెళ్లిపోయారు. పోస్టులో జాబు పంపితే ఆలస్యం అవుతుంది. నా దృష్టిలో జాబుకు విలువ ఎక్కువ. సమయం ఎక్కువ పట్టకూడదు. ఎవరి చేతనో జాబు పంపడం మంచిదికాదు. పవిత్రుడగు వ్యక్తి ద్వారా జాబు పంపితే మంచిదని భావించాను. దీనబంధు మరియు సుశీల రుద్రగారలు సజ్జనులగు రెవరెండ్ ఐర్లండుగారి పేరు సూచించారు. జాబు చదివిన తరువాత తనకు నచ్చితే తీసుకువెళ్లేందుకు ఆయన అంగీకరించాడు. జాబు రహస్యమైనదికాదు. ఆయన చదివారు. ఆయనకు నచ్చింది. తీసుకొని వెళ్లేందుకు అంగీకరించారు. సెకండ్‌క్లాసు కిరాయి యిస్తానని చెప్పాను. కాని ఆయన కిరాయి తీసుకునేందుకు అంగీకరించలేదు. రాత్రిపూట ప్రయాణం అయినా ఆయన ఇంటర్ టిక్కట్టు తీసుకున్నాడు. ఆయన నిరాడంబరత, స్పష్టత చూచి ముగ్ధుడనయ్యాను. యింతటి పవిత్రవ్యక్తి ద్వారా పంపిన జాబుకు సత్ఫలితం చేకూరింది. దానితో నాకు మార్గం సులువైపోయింది. సైన్యంలో యువకుల్ని చేర్చడం యిక నా రెండో బాధ్యత. ప్రజల్ని సైన్యంలో చేరమని నేను విన్నపం చేయాలంటే అందుకు తగిన చోటు ఖేడాయే గదా? నా అనుచరుల్ని ఆహ్వానించకపోతే యింక ఎవర్ని ఆహ్వానించగలను? ఖేడా చేరగానే వల్లభాయి మొదలగు వారితో చర్చించాను. చాలామందికి నా మాటలు రుచించలేదు. రుచించినవారికి యిందు సాఫల్యం లభిస్తుందా అని సందేహం కలిగింది. ఏ వర్గం వారిని ఇందు చేర్చాలో ఆ వర్గం వారికి ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. ప్రభుత్వ అధికారుల వల్ల కలిగిన అనుభవాలు వాళ్లు యింకా మరిచిపోలేదు. అయినా పని ప్రారంభిద్దామని అంతా నిర్ణయానికి వచ్చారు. పని ప్రారంభించినప్పుడు నా కండ్లు తెరుపుడు పడ్డాయి. నా ఆశావాదం తగ్గిపోయింది. ఖేడా సంగ్రామం జరిగినప్పుడు జనం తమ సొంత బండ్లను యిచ్చారు. ఒక్క వాలంటీరుతో పని జరిగేచోట నలుగురు వాలంటీర్లు పనిచేశారు. కాని యిప్పుడు డబ్బుయిచ్చినా బండి కట్టేవాళ్లు కనబడలేదు. అయితే మేము నిరాశపడే రకం కాదుగదా! బండ్లకు బదులు కాలినడకన తిరగాలని నిర్ణయించాం. రోజుకు 20 మైళ్లు నడవాల్సి వచ్చింది. బండిదొరకని చోట తిండి ఎలా దొరుకుతుంది? భోజనం పెట్టమని అడగటం మంచిది కాదుగదా! అందువల్ల ప్రతి వాలంటీరు బయలుదేరినప్పుడే ఆహారం వెంటతెచ్చుకోవాలని నిర్ణయించాం. వేసవికాలపురోజులు. అందువల్ల కప్పుకునేందుకు బట్టలు అవసరంలేదు. వెళ్లిన ప్రతి