పుట:సత్యశోధన.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

394

సైన్యం కోసం యువకుల ఎంపిక

సహకరించడం విరమిస్తారా? యుద్ధం ముగిసిన తరువాత మీ యిష్టం వచ్చినన్ని నైతిక ప్రశ్నలు చేయవచ్చు, యిష్టం వచ్చినట్లు చర్చలు జరపవచ్చు” యిదీ వైస్రాయి లార్డ్ చేమ్స్‌ఫర్డు మాటల సారాంశం.

ఈ తర్కం క్రొత్తది కాదు. అయితే సమయం, విధానం రెండిటి దృష్ట్యా కొత్తదనిపించింది. నేను సమావేశంలో పాల్గొనుటకు అంగీకరించాను. ఖిలాఫత్ విషయమై వైస్రాయికి నేను జాబు వ్రాయాలని నిర్ణయం జరిగింది.

27. సైన్యం కోసం యువకుల ఎంపిక

నేను సభలో పాల్గొన్నాను. సైనికుల్ని చేర్పించి ప్రభుత్వానికి నేను సాయం చేయాలని వైస్రాయి అభిప్రాయపడ్డారు. నేను సభలో హిందీ - హిందుస్తానీలో మాట్లాడతానని చెప్పాను. వైస్రాయి అంగీకరించారు. హిందీతో బాటు ఇంగ్లీషులో కూడా మాట్లాడమని కోరారు. నేను ఉపన్యాసం యివ్వదలచలేదు. “నా బాధ్యత ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. తెలిసికూడా నేను యీ తీర్మానాన్ని సమర్ధిస్తున్నాను” అని మాత్రం అన్నాను.

హిందుస్తానీలో మాట్లాడినందుకు చాలామంది నన్ను అభినందించారు. వైస్రాయి సభలో యీ రోజుల్లో హిందుస్తానీలో మాట్లాడటం యిదే ప్రథమం అనికూడా చెప్పారు. అభినందన, మొదటి పర్యాయం అను మాటలు రెండు నాకు గుచ్చుకున్నాయి. నేను సిగ్గుపడ్డాను. మన దేశంలో, దేశ సమస్యను గురించి దేశభాషలో మాట్లాడకపోవడం, దేశభాషను అవమానించడం ఎంతో విచారకరమైన విషయం. నావంటి వ్యక్తి రెండు వాక్యాలు హిందుస్తానీలో మాట్లాడితే అందుకు అభినందించడమా? మన పతనావస్థను యీ విషయం సూచిస్తున్నది. సభలో నేను అన్నమాటలకు నా దృష్టిలో మంచి తూకం వున్నది. దాన్ని మరిచిపోయే స్థితి యీ సభలో నాకు ఏమీ కనబడలేదు. నాకు గల ఒక బాధ్యతను ఢిల్లీలో నిర్వహించవలసియున్నది. వైస్రాయికి జాబు వ్రాయడం తేలికపనియని నాకనిపించలేదు. సభలో పాల్గొనేందుకు నా తడబాటు, అందుకు గల కారణాలు, భవిష్యత్తుపై నాకుగల ఆశ మొదలగు వాటిని స్పష్టంగా వెల్లడించడం అవసరమని భావించాను.

నేను వైస్రాయికి జాబు వ్రాసాను. అందు లోకమాన్య తిలక్, ఆలీ సోదరులు మొదలగువారిని సభకు ఆహ్వానించనందుకు విచారం వెల్లడించాను. ప్రజల రాజకీయ కోరికలను గురించి, యుద్ధంవల్ల మహమ్మదీయులకు కలిగిన కోరికలను గురించి ఆ