పుట:సత్యశోధన.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

393

సాయం చేయాలని భావించాను. మత విషయంలో శ్రద్ధకు మహత్తరమైన స్థానం వుంటుంది. అందరి శ్రద్ధ ఒకే వస్తువు యెడ, ఒకే విధంగా వుండి వుంటే ప్రపంచంలో ఒకే మతం వుండివుండేది. ఖిలాఫత్‌కు సంబంధించిన కోరిక నాకు నీతి విరుద్ధమని అనిపించలేదు. యీ కోరికను బ్రిటిష్ ప్రధానమంత్రి లాయడ్‌జార్జి అంగీకరించాడు కూడా. ఆయన అంగీకారాన్ని ఆచరణలో పెట్టించడమే నా కర్తవ్యమని భావించాను. అయన మాటలు స్పష్టంగా వున్నాయి. యిక గుణదోషాల్ని గురించి యోచించడం ఆత్మ తృప్తి కోసమేనని తేల్చుకున్నాను.

ఖిలాఫత్ వ్యవహారంలో నేను ముస్లిం సోదరులను సమర్థించాను. దానితో మిత్రులు, కొందరు విమర్శకులు నన్ను తీవ్రంగా విమర్శించారు. వారి విమర్శలను పరిశీలించి చూచిన తరువాత కూడా నేను చేసింది సరియైన పనియేనని నిర్ణయానికి వచ్చాను. ఈనాడు కూడ అటువంటి సమస్య వస్తే నా నిర్ణయం అలాగే వుంటుందని చెప్పగలను. ఈ భావాలతో నేను ఢిల్లీకి వెళ్లాను. మహమ్మదీయుల బాధను గురించి వైస్రాయితో మాట్లాడవలసి వున్నది. అప్పటికి యింకా ఖిలాఫత్ ఉద్యమం పూర్తి రూపు దాల్చలేదు.

ఢిల్లీ చేరగానే దీనబంధు ఆండ్రూస్ ఒక నైతిక ప్రశ్న లేవదీశారు. ఆంగ్లపత్రికల్లో ఇటలీ, ఇంగ్లాండుల మధ్య రహస్య ఒడంబడిక జరిగినట్లు వెలువడిన వార్తలు చూపించి అట్టి స్థితిలో మీరు యీ సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఆ ఒడంబడికను గురించి నాకు ఏమీ తెలియదు. దీనబంధు మాటలు నాకు చాలు. దానితో మీ సమావేశంలో పాల్గొనుటకు నేను సంకోచిస్తున్నానని లార్డ్ చేమ్స్‌ఫర్డుకు జాబు వ్రాశాను. చర్చలకు రమ్మని ఆయన నన్ను ఆహ్వానించారు. వారితోను, మి. మేఫీతోను విస్తృతంగా చర్చించాను. చివరికి సమావేశంలో పాల్గొనుటకు నిర్ణయించుకున్నాను. “బ్రిటిష్ మంత్రివర్గం చేసిన నిర్ణయం వైస్రాయికి తెలియవలసిన అవసరం లేదు గదా? ప్రభుత్వం ఎన్నడూ తప్పుచేయదని నేను చెప్పలేను. ఎవరైనా పొరపాటు చేయవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వపు ఉనికి ప్రపంచ మనుగడకు మేలు కలిగిస్తుందని, దాని కృషివల్ల ఈ దేశానికి సామూహికంగా మేలు జరుగుతుందని మీరు భావిస్తే ఆపద సమయంలో దానికి సాయపడటం ప్రతిపౌరుని కర్తవ్యమని మీరు భావించరా? రహస్య ఒడంబడికను గురించి పత్రికల్లో మీరు చూచినట్లే నేను చూచాను. అంతకంటే మించి నాకేమీ తెలియదు. మీరు నామాట నమ్మండి. పత్రికల్లో ఏదో తలాతోక లేని వార్త వెలువడినందున మీరు యిలాంటి సమయంలో ప్రభుత్వానికి