పుట:సత్యశోధన.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

391

అయినా యీ ఉద్యమం వల్ల కలిగిన సత్ఫలితాలు అనూహ్యమైనవి. పరోక్షంగా ఆ సంగ్రామం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చింది. ఖేడా సంగ్రామంవల్ల గుజరాత్‌కు చెందిన రైతుల్లో గొప్ప చైతన్యం వచ్చింది. వారికి రాజకీయంగా మంచి శిక్షణ లభించింది. విదుషీమణియగు డా. బిసెంట్ ప్రారంభించిన ఉద్యమంకంటే వారిలో నిజమైన చైతన్యం యి ఉద్యమం వల్లనే వచ్చింది. వాలంటీర్లు రైతులతో కలిసిపోయారు. తమ శక్తిని తమ హద్దును తెలుసుకొని ఎంతో త్యాగదీక్షతో పనిచేశారు. వల్లభభాయికి తనశక్తి ఏమిటో తెలుసుకునే అవకాశం ఈ సంగ్రామం వల్ల లభించింది. యిటువంటి అనుభవాలు బార్డోలీలోను, తదితర సంగ్రామాల్లోను కూడా కలిగాయి. గుజరాత్ ప్రజల్లో నూతన తేజస్సు వెల్లివిరిసింది. రైతులు తమ శక్తి ఏమిటో తెలుసుకోగలగడం విశేషం. ప్రజలకు విముక్తి లభించాలంటే అది వారి త్యాగప్రవృత్తిపై ఆధారపడి వుంటుందని అంతా తెలుసుకున్నారు. ఖేడా పోరాటం ద్వారా గుజరాత్ ప్రాంతంలో సత్యాగ్రహం స్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఖేడా సంగ్రామ ముగింపు విషయమై నాకు ఉత్సాహం కలుగకపోయినా అక్కడి ప్రజల్లో మాత్రం నూతనోత్సాహం నెలకొన్నది. తాము అనుకున్నది సాధించామనే విశ్వాసం వారికి కలిగింది. భవిష్యత్తులో యిలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే విధానం కూడా వారికి బోధపడింది. అయితే సత్యాగ్రహమంటే ఏమిటో ఖేడా ప్రజలు తెలుసుకోలేకపోయారు. అందుకు సంబంధించిన వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలియజేస్తాను. 

26. సమైక్యత

ఖేడా వ్యవహారం సాగుతూ వున్నప్పుడు యూరపులో మహాయుద్ధం జరుగుతూవున్నది. యిందుకోసం ఒక సమావేశం ఏర్పాటుచేసి వైస్రాయి ఢిల్లీకి నాయకుల్ని ఆహ్వానించారు. లార్డ్‌చేమ్స్‌ఫర్డ్‌తో నాకు సత్సంబంధం ఏర్పడిందని ముందే వ్రాశాను. కాని ఆ సభలో ఎలా పాల్గొనడం? నాకు ఒక సంకోచం కలిగింది. యీ సభకు ఆలీ సోదరులను, లోకమాన్య తిలక్‌ను మరియు యింకా కొంతమంది నాయకుల్ని ఆహ్వానించలేదు. అదే నా సంకోచానికి కారణం. అప్పుడు ఆలీ సోదరులు జైల్లో వున్నారు. వారిని ఒకటి రెండు సార్లే కలిసాను. వారిని గురించి చాలా విన్నాను. వారి సేవానిరతిని గురించి వారి ధైర్యసాహసాలను గురించి అంతా పొగడటం గమనించాను. హకీం (క్రీ.శ. హకీం అజమల్ ఖాన్) గారితో ప్రత్యక్ష పరిచయం నాకు లేదు. వారి గొప్పతనాన్ని గురించి కీ.శే. రుద్ర్ మరియు దీనబంధు ఆండ్రూస్‌గారల నోట విన్నాను. కలకత్తాలో ముస్లిం లీగు సమావేశం జరిగినప్పుడు కురేషీ, బారిస్టర్