పుట:సత్యశోధన.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

390

ఖేడా సంగ్రామం ముగింపు

ప్రభుత్వం వారిని పట్టుకోకుండా ఎలా వూరుకుంటుంది? పాండ్యాను, ఆయన అనుచరులను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకున్నది. దానితో ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. జైళ్లకు వెళ్లడానికి జనం సిద్ధపడినప్పుడు రాజదండనకు ఎవ్వరూ భయపడరు. ఆ కేసు విచారణను చూచేందుకు జనం విరుచుకుపడ్డారు. పాండ్యాకు, వారి అనుచరులకు కొద్దిగా కారాగార శిక్ష విధించబడింది. కోర్టు వారిచ్చిన తీర్పు తప్పులతడక. అసలు ఉల్లిగడ్డల పెకిలింపు దొంగతనం క్రిందకు రాదు. అయినా అప్పీలు చేయాలని తలంపు ఎవ్వరికీ కలుగలేదు. జైలుకు వెళుతున్నవారిని సాగనంపుటకు ఉల్లిపాయల దొంగ అను గౌరవం ప్రజల పక్షాన పాండ్యా పొందాడు. యిప్పటికీ ఆయన ఆ శబ్దాన్ని తన పేరుతో బాటు ఉపయోగిస్తూ వున్నాడు.

ఈ పోరాటం ఎలా ముగిసిందో వివరించి ఖేడా ప్రకరణం ముగించివేస్తాను. 

25. ఖేడా సంగ్రామం ముగింపు

ఖేడాలో జరిగిన సంగ్రామం విచిత్రంగా ముగిసింది. దృఢదీక్షతో చివరివరకు వున్నవారు నష్టపడిపోవడం నాకు యిష్టంలేదు. సత్యాగ్రహం విజయం కోసం అన్వేషించసాగారు. ఊహించని అట్టి మార్గం ఒకటి దొరికింది. చెల్లించగల పార్టీలు పన్ను చెల్లించితే బీదవారి దగ్గర పన్నుల వసూళ్లు వాయిదా వేస్తామని నడియాద్ తహసీల్దారు కబురు పంపాడు. తహసీల్దారు తన తాలూకా వరకే బాధ్యత వహించగలడు. జిల్లా బాధ్యత కలెక్టరు వహించాలి. అందువల్ల నేను కలెక్టరును అడిగాను. తహసీల్దారు అంగీకరించిన విధంగా ఆదేశం వెలువడింది అని కలెక్టరు చెప్పాడు. నాకీ ఆదేశం విషయం తెలియదు. అటువంటి ఆదేశం ప్రభుత్వం వెలువరిస్తే ప్రతిజ్ఞలో పేర్కొనబడ్డ విశేషం అదే. అందువల్ల మేము అట్టి ఆర్డరుతో తృప్తిపడ్డాం.

అయినా ఈ విధంగా జరిగిన ముగింపు వల్ల నాకు సంతోషం కలుగలేదు. సత్యాగ్రహం సమాప్తమైనప్పుడు ఏర్పడవలసిన మధుర వాతావరణం ఏర్పడలేదు. క్రొత్త నిర్ణయం తాను చేయలేదని కలెక్టరు భావించాడు. అయితే బీదవారిని మివహాయించే విషయమై అతడు అంగీకరించవలసి వచ్చింది. బీదవాళ్లంటే ఎవరో ఎలా తేల్చడం? ఆ విధంగా నిర్ణయించగల శక్తి జనానికి లేకపోవడం విచారించ తగ్గ విషయం. ముగింపు ఉత్సవం జరిపారు. కాని నాకు అంతగా ఉత్సాహం కలుగలేదు. సత్యాగ్రహం ప్రారంభించినప్పటికంటె ముగించినప్పుడు ప్రజల్లో ఎక్కువ ఉత్సాహం తేజస్సు కనబడినప్పుడే దాన్ని విజయంగా భావించాలి. అట్టి తేజస్సు ఖేడా సంగ్రామం సమాప్తమైనప్పుడు నాకు కనపడలేదు.