పుట:సత్యశోధన.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

389

వినమ్రతకూడా వాళ్లకు నేర్పవలసి వచ్చింది. ఇది చాలా కష్టమైన పని. భయం పోయిన తరువాత అధికారులు చేసిన అవమానాలకు, వాళ్లు పెట్టిన కష్టాలకు పగతీర్చుకోవద్దంటే జనం ఊరుకుంటారా? కాని అది సత్యాగ్రహి లక్షణం కాదు. పాలలో విషం కలపడమేకదా? అక్కడి జనం వినమ్రతా పాఠం అర్థం చేసుకోలేదను విషయం ఆ తరువాత తెలుసుకున్నాను. వినయం సత్యాగ్రహికి వుండవలసిన ప్రధాన గుణమని అనుభవంవల్ల తెలుసుకున్నాను. వినయమంటే మాటల్లోనేకాక, వ్యతిరేకులను కూడా ఆదరించాలి. సరళస్వభావం కలిగివుండాలి. అందరి మంచిని కాంక్షించి వ్యవహరించాలి. ఆరంభంలో ప్రజల్లో ధైర్యం అమితంగా కనబడింది. ప్రారంభంలో ప్రభుత్వం కూడా మెత్తగా వ్యవహరించింది. ప్రజల్లో చైతన్యం పెరిగి వాళ్లకు ధైర్యం వచ్చిన కొద్ది ప్రభుత్వం యొక్క కరుకుదనం కూడా అమితంగా పెరిగిపోయింది. జప్తు చేసేవాళ్లు రైతుల పశువుల్ని అమ్మివేశారు. ఇళ్లలో దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. భూములను గురించి కూడా నోటీసులు ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో పండిన పంటల్ని పూర్తిగా జప్తు చేశారు. దానితో జనం భయపడ్డారు. చాలామంది పన్ను చెల్లించి వేశారు. కొంత మంది అధికారులు వచ్చి జప్తు చేయాలని పొంచివున్నారు. అక్కడి జనంలో చివరి శ్వాస వరకు పోరాటం సాగించినవారు కొందరున్నారు. ఈ లోపున శ్రీ శంకర్ లాల్ పారిఖ్ గారి పొలానికి చెల్లించవలసిన పన్ను, అక్కడ పని చేస్తున్న వాడు చెల్లించివేశారు. దానితో గందరగోళం జరిగింది. వెంటనే శంకరలాల్ తన భూమినంతటిని జనానికి దానం చేసి తన మనిషి చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దానితో ఆయన ప్రతిష్ఠ ఇనుమడించింది. అది యితరులకు మంచి ఉదాహరణ అయింది.

తప్పుగా జప్తు చేయబడిన ఒక పొలంలో ఉల్లిగడ్డల పంటవున్నది. భయపడిన జనానికి ధైర్యం కలిగించాలనే భావంతో నేను మోహన్ లాల్ పాండ్యాగారి నాయకత్వాన ఉల్లిగడ్డల్ని పెకిలించమని చెప్పాను. నా దృష్టిలో అది చట్టాన్ని వ్యతిరేకించడం కాదు. చెల్లించవలసిన కొద్దిపన్ను కోసం పంటనంతటినీ జప్తు చేస్తున్నారు. అది మరీ నీతి బాహ్యమైన చర్య. బహిరంగంగా చేస్తున్న దోపిడీయే. అందువల్ల యిటువంటి జప్తుల్ని ఎండగట్టడం అవసరమని చెప్పాను. ఆ విధంగా చేసినందుకు జైలుకు పంపుతారు, సిద్ధపడాలి అని కూడా చెప్పాను. మోహన్ లాల్ పాండ్యా అందుకు సిద్ధపడ్డాడు. కష్టాలు పడకుండా వ్యతిరేకతను ఎదుర్కోకుండా సత్యాగ్రహం విజయం సాధించడం ఆయనకు యిష్టంలేదు. పొలంలో వున్న ఉల్లిగడ్డల్ని పెకిలించేందుకు సిద్ధపడ్డాడు. ఏడెనిమిదిమంది ఆయనకు సాయం చేశారు.