పుట:సత్యశోధన.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

388

ఉల్లిపాయల దొంగ

వ్యతిరేకించం. ఎన్ని కష్టాలైనా సహిస్తాం. మా పొలాలు జప్తు చేసినా ఊరుకుంటాం. మా చేతులతో పన్నులు చెల్లించి అబద్ధాల కోరులం అయి ఆత్మాభిమానం చంపుకోము. ప్రభుత్వం పన్నుల వసూళ్ళు అన్ని చోట్ల ఆపి వేస్తే మాలోశక్తి కలిగిన వాళ్లం పూర్తిగానో లేక కొంత భాగమో తప్పక చెల్లిస్తామని మాట యివ్వలేము. మాలో శక్తిగలవారం పన్నులు చెల్లించి వేస్తే, శక్తి లేనివారు భయపడి తమ కొంపాగోడూ తెగనమ్మి పన్నులు చెల్లించి నానా యాతనలు పడతారు. అందువల్ల శక్తిగలవారం కూడా పన్ను చెల్లించం. యిలా చెల్లించకపోవడం శక్తివంతుల కర్తవ్యమని భావిస్తున్నాము.

ఈ పోరాట వివరాలు తెలుపుటకు ప్రకరణాన్ని పొడిగించదలుచుకోలేదు అందువల్ల యిందుకు సంబంధించిన మధురస్మృతులు అనేకం యిక్కడ వివరించడం లేదు. మహత్తరమైన ఖేడా సత్యాగ్రహ పోరాట చరిత్రను వివరంగా తెలుసుకోవాలని భావించినవారు శ్రీ శంకర్ లాల్ పారిఖ్ వ్రాసిన ఖేడా పోరాట విస్తృత ప్రామాణిక చరిత్ర అను పుస్తకం చదవమని సిఫారసు చేస్తున్నాను. 

24. ఉల్లిపాయల దొంగ

చంపారన్ భారతావనియందు ఒక మూల వున్నది. అక్కడ సాగిన పోరాటం పత్రికలకు ఎక్కలేదు. అక్కడి పరిస్థితుల్ని చూచేందుకై బయటివారు రాకుండా ప్రభుత్వం చర్య గైకొన్నది. అయినా ఖేడా సత్యాగ్రహాన్ని గురించి పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. గుజరాతీ వారికి ఈ విషయం తెలిసింది. వారు శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు. వాళ్లు ఎంత డబ్బు అయినా సరే యివ్వడానికి సిద్ధపడ్డారు. కాని ఈ పోరాటం కేవలం డబ్బుతో నడవదు. డబ్బు అవసరం బహు తక్కువేనని ఎంత చెప్పినా వారికి బోధపడలేదు. వద్దని ఎంత చెప్పినా వినకుండా బొంబాయి పౌరులు చాలా ధనం ఇచ్చి వెళ్లారు. అవసరాన్ని మించి ధనం ఇచ్చినందున పోరాటం ముగిసిన తరువాత కొద్దిగా ధనం మిగిలింది. సత్యాగ్రహులనే సైనికులు సాదా జీవనం నేర్చుకోవలసిన అవసరం వున్నది. వారు పూర్తిగా పాఠం నేర్చుకున్నారని చెప్పలేను, కానీ చాలావరకు తమ జీవనంలో మార్పు తెచ్చుకున్నారని మాత్రం చెప్పగలను.

అక్కడి రైతులు మొదలగు వారికి కూడా పోరాటం క్రొత్తదే. ఊరూరా తిరిగి యీ పోరాటం గురించి ప్రచారం చేయవలసి వచ్చింది. అధికారులు ప్రజల యజమానులు కారు. వారు సేవకులు. ప్రజలిచ్చే డబ్బునే వాళ్లు జీతాలుగా తీసుకుంటున్నారు అని చెప్పి అధికారులంటే గల భయం పోగొట్టవలసిన అవసరం ఏర్పడింది. నిర్భయంతోబాటు