పుట:సత్యశోధన.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

దుఃఖకరమైన ప్రకరణం - 1

కంటే ఆమెకు ధైర్యం ఎక్కువ అని నాకు తెలుసు. నాలో నేను సిగ్గుపడ్డాను. ఆమెకు పాములన్నా, దయ్యాలన్నా భయం లేదు. చీకట్లో ఎక్కడికైనా నిర్భయంగా వెళుతుంది. ఈ విషయాలన్నీ నా స్నేహితునికి తెలుసు. “పాముల్ని చేత్తో పట్టుకుని ఆడిస్తా. దొంగల్ని తరిమికొడతా, దయ్యాల్ని లెక్క చెయ్యను” అంటూ వుండేవాడు. అది అంతా మాంసాహార ప్రతాపమేనని తేల్చేవాడు.

ఆ రోజుల్లో నర్మదకవి వ్రాసిన క్రింది గుజరాతీ పాట పిల్లలంతా పాడుతూ వుండేవారు.

“అంగ్రేజో రాజ్యకరే, దేశీరహే దబాయీ
  దేశీరహేదబాయి జోనే బేనాం శరీర్ భాయీ
  పేలో పాంచ్ హాథ్ పూరో, పూరో పాంచ్‌సే సే

(దేశీయులను దద్దమ్మలుగా చేసి ఆంగ్లేయులు రాజ్యం చేస్తున్నారు. యిద్దరి శరీరాల్ని పరికించి చూడు. మన అయిదువందల మందికి అయిదు అడుగుల ఆంగ్లేయుడొక్కడు చాలు)

వీటన్నిటి ప్రభావం నా మీద బాగా పడింది. మాంసాహారం మంచిదని అది నాకు బలం చేకూర్చి, వీరుణ్ణి చేస్తుందని, దేశ ప్రజలంతా మాంసం తింటే తెల్లవాళ్ళను జయించవచ్చుననే విశ్వాసం నాకు కలిగింది. మాంసభక్షణకు ముహూర్తం నిర్ణయమైంది. అది రహస్యంగా జరగాలి అనే నిర్ణయానికి వచ్చాం. గాంధీ కుటుంబాలవారిది వైష్ణవ సంప్రదాయం. మా తల్లిదండ్రులు పరమవైష్ణవులు. వాళ్ళు ప్రతిరోజు దేవాలయం వెళతారు. మా కుటుంబంలో ప్రత్యేకించి ప్రతి విషయంలో ఆ సంప్రదాయ ఆధిక్యత మెండు. జైనులు, వైష్ణవులు మాంసభక్షణకు పూర్తిగా వ్యతిరేకులు. అంతటి మాంస వ్యతిరేకత హిందూదేశంలో గాని, మరో దేశంలోగాని గల యితర సంప్రదాయాల వాళ్ళకు లేదని చెప్పవచ్చు. యిది పుట్టుకతో వచ్చిన సంప్రదాయ సంస్కారం.

నేను నా తల్లిదండ్రుల పరమభక్తుణ్ణి. నేను మాంసం తిన్నానని తెలిస్తే వాళ్ళ స్థితి ఏమవుతుందో నాకు తెలుసు. అప్పటికే సత్యనిరతి నాలో అధికంగా వుంది. నేను మాంసభక్షణ ప్రారంభిస్తే నా తల్లిదండ్రుల్ని మోసం చేయవలసి వస్తుందను విషయం నాకు తెలుసు. అట్టి స్థితిలో మాంసం తినడం ఎంత భయంకరమైన విషయమో వేరే చెప్పనక్కరలేదు. కాని నా మనస్సంతా సంస్కారదీక్ష మీద కేంద్రీకృతమైంది. నేను మాంసం తింటున్నది రుచి కోసం కాదు. మాంసం రుచిగా వుంటుందని నాకు తెలియదు. నాకు బలం కావాలి. పరాక్రమం కావాలి. నా దేశ ప్రజలంతా పరాక్రమ